సూర్యాపేట, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మంగళవారం సూర్యాపేట జిల్లాలో ప్రారంభమైన రైతుల ఎడ్లబండ్ల యాత్రకు ఊరూరా అపూర్వ స్వాగతం లభిస్తున్నది. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్.ఎస్ మండలంలోని నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయం వద్ద ప్రారంభమైన యాత్రకు గ్రామాగ్రామాన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మహిళలు పెద్దఎత్తున కోలాటాలతో స్వాగతం పలుకుతున్నారు.
యాత్ర ప్రారంభమైన 30 గంటల్లో 60 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం రాత్రికి మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చేరుకున్నది. తొలి రోజు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రారంభించగా, దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించి తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మద్దిరాలకు చేరుకొని అక్కడే రాత్రి బస చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ స్వాగతం పలికిన విషయం విదితమే. మద్దిరాల నుంచి బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమైన ఎడ్లబండ్ల యాత్ర 11గంటల సమయంలో దంతాలపల్లికి చేరుకున్నది.
దంతాలపల్లిలో మాజీ మంత్రి సత్యవతీరాథోడ్ స్వాగతం పలికి రైతులతో మాట్లాడారు. రైతులు అక్కడే మధ్యాహ్న భోజనం చేసి సాయంత్రం వరకు బస చేశారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ర్యాలీ రాత్రి ఎనిమిది గంటలకు తొర్రూరుకు చేరుకుంది. మండుటెండను లెక్క చేయక దాదాపు 130 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సూర్యాపేట రైతాంగం చేపట్టిన యాత్రకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తుండడం విశేషం.