– నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర
నీలగిరి, మే 20 : స్వయం ఉపాధి పథకాల ద్వారా కుటుంబాల ఆర్థిక వృద్ధి సాధించాలని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల ఎంపికకు బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో జాయింట్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాల ప్రాముఖ్యతను వివరించారు. అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేసి బ్యాంక్ రుణం, కార్పొరేషన్ సబ్సిడీతో జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్‌కు 45 యూనిట్లు మంజూరు కాగా 442 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
అభ్యర్థుల అర్హతలు, ఆర్థిక పరిస్థితులు అలాగే ఉపాధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని జాయింట్ ఐడెంటిఫికేషన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఆధారిత స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేసి, వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పారదర్శక విధానంలో ఎంపిక చేపట్టి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ అధికారులు, టి.ఎం.సి శ్రీనివాస్ కమ్యూనిటీ ఆర్గనైజర్లు, సంబంధిత అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

‘స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలి’