మునుగోడు, మార్చి10 : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) మునుగోడు మండల 9వ మహాసభలు ఈ నెల 16న మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు కట్ట లింగస్వామి, మిర్యాల భరత్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు మహాసభల కరపత్రాన్ని మండల కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..యువజన సమస్యల మీద, స్థానిక సమస్యల మీద డీవైఎఫ్ఐ అనేక పోరాటాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఒక కోటి 50 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద యువజన సంఘంగా అవతరించినట్లు తెలిపారు.
మునుగోడు మండలంలో కూడా అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. యువకులు చెడు మార్గంలో పయనించకుండా గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలు వచ్చే మూడు సంవత్సరాలు మండలంలో స్థానిక ప్రజా, యువజన సమస్యలు, విద్యా వైద్యం, ఉపాధి అవకాశాల కల్పన దిశగా భవిష్యత్ కార్యాచరణ చేసేలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొడ్డుపల్లి నరేశ్, శ్రావణ్, శివకృష్ణ, ప్రజాసంఘాల నాయకుడు ఎట్టయ్య పాల్గొన్నారు.