చౌటుప్పల్ రూరల్, జులై 26 : చౌటుప్పల్ మండలం ఖైతాపురం పరిధిలోని హైవేపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు మృతి చెందారు. మరో అడిషనల్ ఎస్పీ ప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గెల్లు శాంతారావు (56), శ్రీకాకుళం జిల్లా సోలంకి మండలం డోల గ్రామానికి చెందిన మేక చక్రధర్‌రావు(55), ఎస్పీ ప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
వారి వాహనం తెల్లవారు జామున నార్కట్‌పల్లి వద్ద బ్రేక్‌డౌన్ కావడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన మరో వాహనం (బొలేరో..ఏపీ18పి 1176)లో బయల్దేరారు. వీరి వాహనం చౌటుప్పల్ మండలం ఖైతాపురం సమీపంలోని యుటర్న్ వద్దకు రాగానే ముం దున్న మరో వాహనం బ్రేక్ వేయడంతో వీరి డ్రైవర్ నర్సింగ్‌రావు తప్పించబోయి కుడి వైపునకు తిప్పడం తో డివైడర్‌ను ఢీకొని డివైడర్ అవతలవైపు ఉన్న రోడ్డుకు అడ్డంగా వెళ్లింది.
అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొనడంతో డీఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. అడిషనల్ ఎస్పీ శాంతారావుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలకు చౌటుప్పల్ దవాఖానలో పోస్టుమార్టం చేసి, స్వగ్రామాలకు తరలించారు. ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగ్‌రావు తీవ్రం గా గాయపడటంతో వారిని హైదరాబాద్‌లోని కామినేని దవాఖానకు తరలించారు. ఘటనా స్థలాన్ని తెలంగాణ సీపీ సుధీర్‌బాబు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఏసీపీ మధుసూదన్‌రెడ్డి,సీఐ మన్మథకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.