చివ్వెంల, సెప్టెంబర్ 15 : కల్తీ చేపల దాణా తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ నాగభూషణం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దురాజ్‌పల్లి శివారులో గల భవ్యశ్రీ ట్రేడర్స్ తవుడు మిల్లు యజమాని చేపల దాణాను తీసుకొచ్చి అందులో సున్నపురాయి పొడిని కలిపి విక్రయిస్తున్నాడు.
విషయం తెలిసిన ఎస్ఐ విష్ణు తన సిబ్బందితో మిల్లుపై దాడులు నిర్వహించి 459 బస్తాల కల్తీ దాణాను సీజ్ చేశారు. మిల్లు యజమాని పొలిశెట్టి రమణతో పాటు అతడికి సహకరించిన చీదెళ్ల నాగరాజు, గంగ శ్రీనివాస్‌రెడ్డిని దురాజ్‌పల్లి క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మత్స్యశాఖ అధికారి గుండెపురి ఉపేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చేపల దానా కల్తీని అరికట్టిన ఎస్ఐ విష్ణును డీఎస్పీ అభినందించారు.