హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (65వ నంబర్) ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. హైవే అధికారులు సరైనా చర్యలు తీసుకోకపోవడంతో నిత్యం పదుల సంఖ్యలో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా సకాలంలో క్షతగాత్రులకు వైద్యం అందక పోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం డ్రైవర్ల అతివేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణాలతో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు అనాథాలుగా మారుతున్నాయి.
హెచ్చరిక బోర్డులేవీ..
నిబంధనల ప్రకారం నేషనల్ హైవే అథారిటీ అధికారులు డేంజర్ జోన్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. నకిరేకల్, నార్కట్‌పల్లి, కట్టంగూర్, చిట్యాల, కేతేపల్లి వద్ద రోజూ ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చిట్యాల, కట్టంగూర్లవద్ద ఫ్లైఓవర్ లు నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. కొర్లపహాడ్, పెద్దకాపర్తి యూ జంక్షన్, కట్టంగూర్-నల్లగొండ క్రాస్ రోడ్డు, కట్టంగూర్ లోకల్ లో అండర్ పాస్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్డులు నిర్మించాలని ప్రతిపాదించారు. చిట్యాల వై జంక్షన్ నుంచి కేతేపల్లి వద్దనున్న టేకుమట్ల బ్రిడ్జి వరకు అవసరమైన అండర్ పాస్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్డులు, ఫ్లైఓవర్లు, సూచీ బోర్డులు ఏర్పాటు చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
హైవే ప్రమాదాలపై డీఎస్పీ విచారణ
జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై ఈ నెల 16న సీఐ రాఘవరావుతో కలిసి నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి నివారణ చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగే ప్రాంతాలను గుర్తించాలని సీఐకు సూచించారు. ప్రతి రోజూ రాత్రివేళ జాతీయ రహదారిపై
పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.
ఈ నెలలో జరిగిన ప్రమాదాలు కొన్ని..
ఈ నెల 12న నకిరేకల్ బైపాస్‌లో 65వ నంబర్ జాతీయ రహదారి నుంచి తాటికల్ సర్వీసు రోడ్డుకు సూర్యాపేట అపర్ణ నర్సింగ్ కాలేజీ బస్సు మళ్తుండగా వెనుక నుంచి ఓ లారీ అతివేగంగా ఢీకొట్టింది. దాంతో బస్సు ఫల్టీ కొట్టడంతో 13 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి చేతులు విరిగాయి.డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తెలిపారు.
16న కే తేపల్లి మండలం ఇనుపాముల శివారులో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన చీదెళ్ల ఫణికుమార్, తన తల్లి మృతిచెందగా భార్య కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా అజాగ్రత్తతో నడపడమే కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ చెప్పారు.
9న ఇనుపాముల గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని ఇన్నోవా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
6న చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయరహదారిపై యూటర్న్ చేస్తుండగా రెండు కార్లు లారీని ఢీకొట్టాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
13న చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు.
18న చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయరహదారిపై అదే గ్రామానికి చెందిన దొడ్డి రాజేశ్(27)ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
వారం రోజుల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం
హైవే ప్రమాదాలపై జీఎంఆర్ వాళ్లతో మాట్లాడాను. నకిరేకల్ బైపాస్‌లోని తాటికల్ సర్వీస్ రోడ్డు వద్ద, పద్మానగర్ జంక్షన్ యూటర్న్ వద్ద, చందుపట్ల బ్రిడ్జి వద్ద, ఇనుపాముల యాక్సిడెంట్ ప్రోన్ ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. అతివేగం, నిద్రమత్తు, అజాగ్రత్తల వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణపై స్టేషన్ల వారీగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.
– సీఐ, వెంకటయ్య,నకిరేకల్