– రోడ్డు, భవనాల శాఖ మంత్రి ఇలాకాలో రోడ్ల కోసం పాదయాత్ర
రామగిరి, ఆగస్టు 25 : నల్లగొండ పట్టణం 9వ వార్డు పరిధిలోని నడ్డివారిగూడెంకు రోడ్డు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే నడ్డివారిగూడెం నుండి దేవరకొండ రోడ్డు వరకు డబుల్ సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాశం డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నడ్డివారిగూడెం నుండి మన్నెగూడెం, గందవారిగూడెం, అక్కలాయగూడెం, దేవరకొండ రోడ్డు, ప్రకాశం బజార్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాములుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హాశం మాట్లాడుతూ.. 20 సంవత్సరాలు నల్లగొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రోడ్డు భవనాల శాఖ మంత్రిగా 20 నెలలుగా పని చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి జిల్లా కేంద్ర పట్టణంలో రోడ్డు వేయాలని దృష్టి లేకపోవడం దురదృష్టకరమన్నారు. నడ్డివారిగూడెంలో పాము, తేలు, ఇతర ప్రమాదాల్లో అత్యవసర వైద్యం అందక ఇప్పటికే నలుగురు మరణించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ.. సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై సర్వేలో భాగంగా అధ్యయనం చేస్తున్న క్రమంలో నల్లగొండ పట్టణాన్ని సుందరవనం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి పట్టణ శివారు ప్రాంతాలు, విలీన పంచాయితీలను సందర్శించాలన్నారు. నల్లగొండ పట్టణ పరిధిలో తొమ్మిదో వార్డు నడ్డివారిగూడెం దళితవాడగా 40 కుటుంబాలతో ఉందన్నారు. వారికి తక్షణమే దేవరకొండ రోడ్డు నుండి నడ్డివారిగూడెం వరకు డబుల్ సీసీ రోడ్డు నిర్మించాలన్నారు. అలాగే ఇంటర్నల్ కరెంట్ లైన్లు, త్రిబుల్ పేస్ వేయాలని కోరారు. 2013లో మున్సిపాలిటీలో విలీనం అయిన తర్వాత ఉపాధి హామీ పథకం పోయిందన్నారు. గతంలో తేలకంటిగూడెం నుండి మిషన్ భగీరథ ద్వారా వస్తున్న మంచినీరు ఆగిపోయిందన్నారు.
2019లో అమృత స్కీం ద్వారా మంచినీటి పైప్లైన్లు వేసినా నడ్డివారిగూడెం, లాలయ్యగూడెం, గంధంవారిగూడెం వార్డు పరిధిలోని మరికొన్ని ప్రాంతాల్లో రక్షిత మంచినీరు రావడం లేదన్నారు. సింగిల్ ఫేస్ కరెంట్ కావడంతో చిన్నపాటి గాలి దుమారం వచ్చినా కాలనీ అంతా అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. 9వ వార్డు పరిధిలోని వెంకటరమణ కాలనీ, న్యూ వెంకటరమణ కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గుంతలు తవ్వి పైప్ లైన్లు వేసి పూడ్చి ట్రావెలింగ్ చేయకపోవడంతో చిన్నపాటి వర్షాలకు బురదమమై ఇండ్ల నుండి బయటకు రాలేని దుస్థితి నెలకొందన్నారు. కొత్తగా పెన్షన్ల కోసం అర్హత కలిగి వారు దరఖాస్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇండ్ల మీద నుండి విద్యుత్ వైర్లు వెళ్లి ప్రమాదాల అంచున ప్రజలు నివసిస్తున్నట్లు తెలిపారు. వార్డు పరిధిలోని కొన్ని కాలనీలలో అద్దె ఇంట్లో ఉంటున్న పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అవుట రవీందర్, కుంభం కృష్ణారెడ్డి, దండెంపల్లి సరోజ, గాదె నరసింహ, అక్కలాయిగూడెం శాఖ కార్యదర్శి బచ్చగొని మల్లేష్, బొమ్మ నాగరాజు, మన్నె అశోక్, నడ్డివారిగూడెం గ్రామస్తులు గట్టిగుండ్ల వీరయ్య, దేవేందర్, యాదయ్య, వెంకన్న, జేరిపోతుల సైదులు, పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, గుండాల నరేష్, గంజి నాగరాజు, సలివోలు సైదాచారి, సర్దార్ అలీ, సీత వెంకటయ్య, కోట సైదులు, సోషల్ మీడియా ఇన్చార్జి భీమగాని గణేశ్, వీరబాబు, బక్కయ్య, శ్రీను, గంజి రాజేశ్, సిరాజుద్దీన్ పాల్గొన్నారు.
Ramagiri : నడ్డివారిగూడెం నుండి డీవీకే రోడ్డు వరకు డబుల్ సీసీ రోడ్డు నిర్మించాలి