పేదల సొంతింటి కల కలగానే మారుతున్నది. కేసీఆర్ సర్కారు హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపును కాంగ్రెస్ సర్కారు కాలయాపన చేస్తున్నది. ఇండ్ల నిర్మాణం పూర్తియి పంపిణీకి సిద్ధంగా ఉన్నా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు అందని ద్రాక్షగానే మారాయి. లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసినా ఇవ్వకపోవడంపై లబ్ధిదారులు ఆందోళనలు చేపడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. పేదలకు పైసా ఖర్చు లేకుండా కేసీఆర్ సర్కారు ఇండ్లను నిర్మించింది. జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఇండ్లను మంజూరు చేసింది. జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాలకు 3,620 ఇండ్లను శాంక్షన్ చేసింది. ఇంటి నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 5.04లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.40 లక్షలు ఖర్చు చేశారు. వీటిని నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. సుమారు వెయ్యి ఇండ్లకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా ఇండ్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
కొన్ని మండలాల్లో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయగా.. అనేక మండలాల్లో ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక జరుగలేదు. బీబీనగర్ మండలంలోని కొండమడుగులో 30 ఇండ్లు, బీబీనగర్‌లో 11 ఇండ్లు పూర్తయినా ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో ఇండ్లు కట్టినా పంపిణీ ప్రక్రియ చేపట్టలేదు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెం వద్ద 444 ఇండ్లను నిర్మించగా, గతేడాది అక్టోబర్‌లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. కానీ.. ఇప్పటి వరకు ఇండ్లను కేటాయించలేదు. భూదాన్ పోచంపల్లిలో 60, జిబ్లక్పల్లిలో 36 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసినా కేటాయించకపోవడంతో గృహప్రవేశం ఊసేలేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల సమస్యలపై దృష్టి సారించడంలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి కనీసం పట్టించుకోవడంలేదు. దీంతో లబ్ధిదారులు రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెం వద్ద ఇప్పటికే పలు మార్లు ధర్నాకు దిగారు. అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గినా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో పలు దఫాలుగా నిరసనలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని.. తాసీల్దార్ల ద్వారా సర్వే పూర్తి చేశారు. ఈ జాబితాలో అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను వడబోశారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఎంపిక చేశారు. భువనగిరి, ఆత్మకూర్ (ఎం), కొలనుపాలక, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోటకొండూరు, ఆలేరు, చౌటుప్పల్, నారాయణపురం తదితర మండలాల్లో డ్రా తీశారు. ఆయా మండలాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఆలేరు, చౌటుప్పల్, మోటకొండూరు, ఆత్మకూర్ (ఎం) మండలాల్లో లబ్ధిదారులు గృహప్రవేశం కూడా చేశారు.
పోచంపల్లి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి చాలా రోజులైంది. పేదలు మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇంత వరకూ డ్రా తీయలేదు. లబ్ధిదారులకు అలాట్మెంట్ చేయలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో దుండగులు అద్దాలు పగులగొట్టడం, వైర్లు చోరీ చేస్తున్నారు. వెంటనే డ్రా తీసి అర్హులైన పేదలందరికీ ఇండ్లు కేటాయించాలి.
– ప్రసాదం విష్ణు, దోతిగూడెం, భూదాన్ పోచంపల్లి మండలం