పెన్పహాడ్, జూన్ 13 : పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అనాజిపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (AAM) మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) గా సేవలందిస్తున్న డాక్టర్ చిప్పలపల్లి అనూష శనివారం ఉదయం 7:33 గంటలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇమాంపేట నివాసి అయిన డాక్టర్ అనూషకు ఇది తొలి కాన్పు. పుట్టిన బాబు 2.5 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. బాబుకు జన్మించిన వెంటనే వేయాల్సిన తొలి టీకాలు (Birth Dose) వేసి, తల్లిపాలు (Breast Feeding) ఇప్పించడం జరిగిందని, ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పెన్పహాడ్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్.రాజేష్ తెలిపారు. డాక్టర్ అనూష భర్త డాక్టర్ డి.కార్తీక్ కూడా నల్లగొండ జిల్లా పాములపాడు పీహెచ్సీ పరిధిలోని ఆగమోత్కూరు సబ్ సెంటర్లో MLHP గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవంపై పెన్పహాడ్, పాములపాడు ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది, సహోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ వైద్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.