– విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ
నల్లగొండ, జూలై 04 : ఎంత ఎదిగినా తమ మూలాలను మరిచి పోవద్దని వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ అన్నారు. వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వైఆర్పీ ఫౌండేషన్ స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదివి, మంచి నడవడికతో ముందుకు సాగాలని కోరారు. తమ ఫౌండేషన్ ద్వారా ఈ ఏడాది రూ.80 లక్షలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో 41 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని సూచించారు. తమ సంస్థ చదివే విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
స్కాలర్షిప్లను ఉపయోగించుకుని మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకొని ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత సమాజానికి తోటి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని చేసిన మేలును మరవద్దని చదువుతోపాటు సంస్కారం కూడా నేర్చుకోవాలన్నారు. ఎవరికి ఇష్టం ఉన్న రంగంలో వారు పట్టుదలతో అంకితభావంతో కష్టపడి చదువుకుని బంగారు భవిష్యత్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. వై.ఆర్.పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిదిస్తున్నామని అలాగే ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయన్నారు.
ఈ సంవత్సరం సుమారు 80 లక్షల రూపాయల స్కాలర్షిప్లను 100 మందికి పైగా విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. ఎంత ఎదిగినా కూడా కుల, మత, వర్గ బేధాలు లేకుండా ఐక్యంగా ఉంటూ అభివృద్ధి చెందాలన్నారు. నల్లగొండ కార్పొరేటర్ యామా కవిత మాట్లాడుతూ.. విద్యా దానం అన్నిటికంటే ఎక్కువ అని, ఆది సమాజంలో మార్పు తెస్తుందని అన్నారు. సాయం పొందిన విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఆర్పీ ఫౌండేషన్ డైరెక్టర్ శరత్ చంద్ర, జిల్లా ఇన్చార్జి యామా దయాకర్, రవి ప్రసాద్, రాఘవా చారి పాల్గొన్నారు.

మూలాలను మర్చిపోవద్దు : వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్