సూర్యాపేట, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నా ఇంకా కొన్ని చోట్ల సీమాంధ్రులు ఆడిందే ఆటగా..పాడిందే పాటగా సాగుతోంది. రెండేళ్ల కిత్రం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఉమ్మడి రాష్ట్ర పాలనను తీసుకువస్తోందేమోననే అనుమానాలు వస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ.. సూర్యాపేట మెడికల్ కళాశాల లో నిబంధనలను తుంగలో తొక్కి ఆంధ్రా ప్రాం తానికి చెందిన వైద్యుడిని కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ చేయడం.
ఇటీవల సూర్యాపేట మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రాఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం తెలంగాణ వారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడి వారు లేని పక్షంలో ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని తీసుకోవాలి. కానీ ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు విషయంలో స్థానికులను కాదని పక్క రాష్ట్రానికి చెందిన డాక్టర్‌కు పోస్టింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.
తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులతో పాటు మన ఉద్యోగాలు మనకే దక్కాలనే ఆంశంపై జరిగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇరవై నెలల పాలనలో ఇస్తానన్న పథకాలను ఇవ్వకపోగా కేసీఆర్ హయాంలో చేపట్టిన పథకాలకు మంగళం పాడుతున్న విషయం విదితమే. దీంతో మళ్లీ ఉమ్మడి ఆంధ్రా పాలన వచ్చిందా అనే అనుమానం గత రెండేళ్లుగా కలుగుతోంది. కేసీఆర్ తెచ్చిన నీళ్లు పోయాయి… కరెంటు పోయింది.. రైతు బంధు బందు పెట్టారు.. ఇలా అనేక పథకాలను పక్కకు పెట్టడంతో పాటు ఉద్యోగాల్లో కూడా సొంత రాష్ట్రం వారికి అన్యాయమే జరుగుతోంది. ఇప్పుడు ఇదే విషయమం సూర్యాపేట మెడికల్ కళాశాలలో వెలుగులోకి వచ్చింది.
కాంట్రాక్టు పద్ధతిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు నిబంధనలకు నీళ్లొదిలి ఆంధ్ర ప్రాంత వైద్యులకు ఉద్యోగం ఇవ్వడం సూర్యాపేట మెడికల్ కళాశాలలో వివాదాలకు దారి తీస్తోంది. ఇటీవల సూర్యాపేట మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రాఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 50 మందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకునేలా నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారమే పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్నారు.
నోటిఫికేషన్ ప్రకా రం తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడి వారు లేని పక్షంలో ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని తీసుకోవాలి. కానీ ఇక్కడ పాథాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ విషయంలో నిబంధనలను తుంగలో తొక్కినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణాకు చెందిన ఓ డాక్టర్ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోగా ఆయనను కాదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్‌ను నియమిస్తూ జాబితా విడుదల కావడం గమనార్హం.
సాధారణంగా రిక్రూట్మెంట్ల విషయంలో 80శాతం అకడమిక్ మార్కులు, 20 శాతం ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే ఈ పోస్టు విషయంలో అకడమిక్ మార్కులు తెలంగాణ అభ్యర్థికే ఎక్కువ ఉన్నాయి. అసలు స్థానికులను కాదని వేరే రాష్ట్రం వారికి ఇవ్వకూడనే నిబంధన ఉండగా అకడమిక్ మార్కులు ఎక్కువ ఉన్న వారిని కాదని తక్కువ మార్కులు ఉన్న ఆం ధ్రా వ్యక్తికి ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. నాలుగో ర్యాంకులో ఉన్న సదరు ఆంధ్ర ప్రాంత వైద్యుడు గతంలో కాకతీయ, గాంధీ మెడికల్ కళాశాలల్లో ఇదే పోస్టుకు దరఖా స్తు చేసుకున్నారు.
అయితే అక్కడి అధికారులు ఐదో ర్యాంకు ఉన్న తెలంగాణ ప్రాంత వైద్యుడికే ప్రాధాన్యత ఇచ్చి సముచిత నిర్ణయం తీసుకున్నారు. పైగా ఆయా చోట్ల ప్రొవిజినల్ జాబితాలో నాన్ లోకల్ అని పక్కన పెట్టగా.. సూర్యాపేటలో మాత్రం స్థానికతను పట్టించుకోకుండా నాన్‌లోకల్ అభ్యర్థికే అందలం ఎక్కించడం గమనార్హం. పైగా ఇక్కడ నాన్‌లోకల్ అనే పదమే కనిపించకపోవడంతో పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంటనే అధికారులు స్పందించి అర్హులైన తెలంగాణ వైద్యుడికే పోస్టింగ్ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.