నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో యాసంగి సీజన్ వరి కోతలు ముమ్మరంగా నడుస్తున్నాయి. కాగా, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం లారీలు మిర్యాలగూడ ప్రాంతానికి జోరుగా వస్తున్నాయి. దీంతో జిల్లా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రైస్ మిల్లర్లు అనేక కొర్రీలు పెడుతున్నారు. ఏపీ రైతులు అతి తక్కువ ధరకే ఇక్కడి మిల్లులకు ధాన్యం రవాణా చేస్తుండడంతో జిల్లా రైతులు పండించిన ధాన్యాన్ని ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఉమ్మడి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
గతంలో బయటి ధాన్యాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం
గతంలో నల్లగొండ జిల్లా రైతులు పండించిన ధాన్యానికి వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం బార్డర్ చెక్‌పోస్టుల వద్ద టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకున్నది. దాంతో జిల్లా రైతాంగానికి మద్దతుకు మించి ధర లభించింది. ప్రస్తుతం యాసంగి సీజన్ వరి కోతలు ప్రారంభమై 20రోజులు అవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రైతులకు సరైన ధర అందుతుందా.. లేదా? అనే విషయంపై ఎవరూ దృష్టి సారించడం లేదు. దాంతో మిర్యాలగూడ పరిసర ప్రాంతాల రైస్ మిల్లులకు వాడపల్లి, రామాపురం, నాగార్జునసాగర్ చెక్‌పోస్టుల నుంచి దర్జాగా ఏపీలోని సన్న ధాన్యాన్ని తీసుకొస్తున్నారు.
తక్కువ ధరకే ఆంధ్రా ధాన్యం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బార్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి నల్లగొండ జిల్లాకు ధాన్యం జోరుగా వస్తుంది. అక్కడి రైతులు క్వింటా రూ.2వేలకే మిల్లు వద్దకు రవాణా చేస్తున్నారు. దాంతో జిల్లా రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి పచ్చి గింజ ఉంది.. ధాన్యం డ్రై అయ్యింది అని మిల్లర్లు సాకులు చెబుతూ ధరలో కోత విధిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320 ఉండగా, వ్యాపారులు రూ.2100 నుంచి రూ.2200 వరకే కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి లారీల ద్వారా అధికంగా ధాన్యం రవాణా కావడం వల్లే ఇక్కడ పండించిన ధాన్యానికి కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి ధాన్యం రవాణాను అడ్డుకొని మన ధాన్యానికి మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
ధాన్యం కొనకుండా ఇబ్బందులు పెడుతున్నారు
నేను నాలుగెకరాల్లో పండించిన సన్న ధాన్యాన్ని మిర్యాలగూడకు తీసుకొచ్చాను. 15 మిల్లులు తిరిగినా ఎవరూ కొనుగోలు చేయలేదు. చివరికి తక్కు వ ధరకు క్వింటా 2,150 రూపాయలకే అమ్మాల్సి వచ్చిం ది. బయటి రాష్ట్రాల నుంచి ధాన్యం లారీలు రావడం వల్లే ఇక్కడి రైతులకు మద్దతు ధర పెట్టడం లేదు. గత ప్రభుత్వం బార్డర్ చెక్‌పోస్టుల వద్ద టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను పెట్టి బయటి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టింది. దానివల్ల ఇక్కడ రైతులకు మద్దతు ధర దక్కింది. ఇప్పుడు బార్డర్ చెక్‌పోస్టుల వద్ద అడ్డంకులు లేకపోవడంతో బయటి రాష్ట్రాల నుంచి ధాన్యం జోరుగా వస్తుంది. ప్రభుత్వం స్పందించి బయటి రాష్ర్టాల నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకొని స్థానిక రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి.
– ఎల్.నాగేశ్వర్రావు, రైతు, దామరచర్ల
మనకు మద్దతు ధర ఇవ్వడం లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని అక్కడి రైతులు లారీల ద్వారా తక్కువ ధరకే మిర్యాలగూడ రైస్ మిల్లులకు రవాణా చేస్తున్నారు. దీని వల్ల నల్లగొండ జిల్లాలో సన్న ధాన్యం పండించిన రైతులకు మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకుండా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. 15రోజుల క్రితం క్వింటా రూ.2500 అమ్మితే.. ఇప్పుడు రూ.2200లోపే కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారు. తక్కువ ధర ఉండడంతో వరి కోతలు ఆపేసిన. ధర పెరుగుతదని వేచిచూస్తున్నా. ప్రభుత్వం స్పందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్న ధాన్యాన్ని బార్డర్ చెక్‌పోస్టుల వద్ద అడ్డుకోవాలి. మన రైతులకు మద్దతు ధర అందేలా జిల్లా మంత్రులు చర్యలు చేపట్టాలి.
– సైదులు, రైతు, మాడ్గులపల్లి