నల్లగొండ ప్రతినిధి, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఆధునిక టెక్నాలజీతో ఇండ్లను పైకి లేపడం ఇప్పటివరకు నగరాల్లోనే చూశాం. నల్లగొండ లాంటి పట్టణాలకు సైతం ఈ టెక్నాలజీ చేరుకోవడం విశేషమే. నల్లగొండ పట్టణంలోని రవీంద్రనగర్‌లో ల్యాండ్ సర్వే విభాగంలో ఏడీగా పనిచేస్తున్న బోనగిరి శ్రీనివాస్ సాహోసోపేత నిర్ణయంతో ముందడుగు వేశారు. 20 ఏండ్ల కిందట నిర్మించిన ఈ ఇల్లు కాలక్రమంలో రోడ్డు ఎత్తు పెరుగడంతో దిగువకు అయ్యింది. వర్షాకాలంలో వరద ఇంట్లోకి వచ్చి చేరుతుండడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఇంటిని అమ్మేయాలా..? కూల్చి కొత్తది కట్టాలా..? అని ఆలోచించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో ఓ ఇంటిని పైకి లేపుతున్నారన్న సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లారు. సాధ్యాసాధ్యాలపై వాళ్లతో చర్చించారు. గతంలో ఇలాంటి నిర్మాణాలపై యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో సెర్చ్ చేశారు. కుటుంబ సభ్యులంతా ఓ నిర్ణయానికి వచ్చి ఇంటి ఎత్తు పెంచేందుకు మొగ్గు చూపారు.
హర్యానాకు చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ ఇంటి ఎత్తును పెంచేలా ఒప్పందం చేసుకున్నారు. ఎలాంటి డ్యామేజీ లేకుండా నెలన్నర రోజుల్లో రెండున్నర ఫీట్లు పైకెత్తి నిర్మించాలన్నది ఆ ఒప్పందం. గత నెల 10న పనులు ప్రారంభించి ముందుగా గోడలకు, మెట్ల వరుసకు రంధ్రాలు చేసి 120 జాకీలు బిగించారు. జాకీలన్నింటినీ ఓకేసారి పైకి లేపుతూ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఇల్లు సరిగ్గా రెండున్నర ఫీట్ల ఎత్తులో జాకీలపైనే ఉన్నది. ఇంటితో పాటు మెట్ల వరుస కూడా జాకీలపై గాలిలోనే తేలుతున్నట్లు కనిపిస్తున్నది. జాకీల పక్కన ఇటుకలతో గోడను నిర్మిస్తున్నారు. అన్ని వైపులా గోడ నిర్మాణం జరుగుతున్నది. ఇల్లు కుదురుకున్న తర్వాత జాకీలను ఒక్కొక్కటిగా తొలగించనున్నారు. మరో 15 రోజుల్లో పూర్తిగా జాకీలను తీసేయనున్నారు.
జాకీలతో ఇంటిని పైకెత్తడం, మార్బుల్స్, కలర్స్ వేయడానికి సుమారు రూ.6లక్షలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంటిని పైకెత్తే సమయంలో ఏసీలు, ఫ్యాన్లు, ఇతర సామగ్రి మొత్తం అలాగే ఉంచి పనులు ప్రారంభించారు.
చిన్నపాటి వర్షానికే ఇంట్లోకి వరద వస్తుండడంతో ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాం. యూట్యూబ్‌లో చూడడంతోపాటు బాలాపూర్‌లో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నాం. ఎలాంటి డ్యామేజీ లేకుండా పనులు పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం ఇల్లంతా జాకీలపైనే ఉంది. దిగువ నుంచి గోడలు కట్టి ఇంటిని దానిపై సెట్ చేస్తారు. మరికొద్ది రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్న పనుల పట్ల మా కుటుంబ సభ్యులంతా హ్యాపీగా ఉన్నారు.
– బోనగిరి శ్రీనివాస్, రవీంద్రనగర్