సూర్యాపేట, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో అంబులెన్స్‌ల పేరిట డీజిల్‌ను సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ పేరుతో పేషెంట్లను దూర ప్రాంతాలకు తరలించినట్లు బిల్లులు సృష్టించి నెలనెలా వేలాది రూపాయలు స్వాహా చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ఓ డ్రైవర్‌కు విషయం తెలిసి అవినీతి సొమ్ములో వాటా కావాలని డిమాండ్ చేస్తూ రచ్చచేయడంతో న్యూసెన్స్ అవుతుందని ఆందోళన చెందిన అక్రమార్కులు వెంటనే సదరు డ్రైవర్‌తో చర్చలు చేసి నోరు మూయించినట్లు ఆసుపత్రి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సూర్యాపేటలో ఏరియా ఆసుపత్రిగా ఉండగా మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత జనరల్ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ అయ్యింది.
తదనుగుణంగా గత నాలుగైదేండ్లుగా అత్యున్నత ప్రమాణాలతో రోగులకు కార్పొరేట్ వైద్యం అందించారు. కానీ కొద్ది నెలలుగా ఈ ఆసుపత్రి తిరోగమనంలోకి పయనిస్తున్నది. ఓపీ నుంచి మొదలు ప్రసవాలు, అన్ని రకాల ఆపరేషన్లు తగ్గిపోతున్నాయి. దీనికి కారణం ఆసుపత్రిపై పర్యవేక్షణ లేకపోవడమేనని తెలుస్తున్నది. ప్రస్తుతం జనరల్ ఆసుపత్రికి ఇన్చార్జి సూపరింటెండెంట్ ఉండగా ఇదే ఆసుపత్రిలో పనిచేసే మరో డాక్టర్ అనధికారికంగా అధికారాన్ని చలాయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని సమాచారం.
అతనే అంబులెన్స్ పేరుతో తన సొంత వాహనంలో వారానికి రెండు సార్లు డీజిల్ పోయించుకుంటున్నాడని పేరు బహిర్గతం చేయడానికి నిరాకరించిన మరో డాక్టర్ చెబుతున్నాడు. నోరున్నోడిదో రాజ్యం అన్న చందంగా అతడి వ్యవహారం ఉందంట. ఒక్క డీజిల్ విషయంలోనే కాకుండా ఆసుపత్రిలోని అన్నింటా వేలుపెట్టి మందుల కొనుగోళ్లలో సైతం కమీషన్లకు తెరలేపాడని తెలుస్తున్నది.
హైదరాబాద్ హెడ్ ఆఫీసులో తను ఎంత చెబితే అంతే అని, తనకు ఎవరు అడ్డు తగిలినా బదిలీ తప్పదని హెచ్చరిస్తున్నట్లు ఆసుపత్రిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు ఖరీదైన వైద్యం అందుతున్న ఈ ఆసుపత్రి రోజురోజుకు అవినీతి, అక్రమాలకు నిలయంగా మారుతున్నది. తక్షణమే ఉన్నతాధికారులు కలుగజేసుకొని అడ్డుకోకపోతే ఆసుపత్రి క్రెడిబిలిటీ మరింత దిగజారడం ఖాయం. అలాగే ఆసుపత్రిలో గతం కంటే ఓపీ తగ్గుతుండడం, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండకపోవడంతోపాటు ఇతర చికిత్సలు అందడం లేదని వస్తున్న ఆరోపణలపై స్పందించి చర్యలు చేపట్టాల్సి ఉంది.