మునుగోడు, మార్చి 22 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఈ నెల 25న మునుగోడు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్ అధికారుల పాలనతో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నట్లు తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి సంవత్సరం గడుస్తున్నా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. గ్రామ కార్యదర్శిలు కనీస వసతులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
సంవత్సరాల తరబడి రేషన్ కార్డు, పింఛన్, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్ పథకం కోసం అర్హులు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తక్షణమే గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, యాట యాదయ్య, కట్టా లింగస్వామి, దొండ వెంకన్న, గోసుకొండ రాములు, కల్వలపల్లి గ్రామ కార్యదర్శి వంటేపాక అయోధ్య పాల్గొన్నారు.