నల్లగొండ ప్రతినిధి, జూన్18 (నమస్తే తెలంగాణ): ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీతో అన్ని రంగాల్లోనూ మెరుగైన సేవల వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న దేవరకొండ పోలీసులు ఏఐ సహకారంతో పోలీసు శాఖలో పటిష్ట బందోబస్తు చర్యలు, పర్యవేక్షణకు శ్రీకారం చుట్టారు. అందుకోసం ప్రత్యేకంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆధ్వర్యంలో దేవరకొండ ఏఎస్సీ మౌనిక నిర్వహణలో ప్రత్యేకంగా స్పాట్(SPOT)యాప్‌ను రూ పొందించారు.
యాప్ రూపకల్పన కోసం ఐఐటీ వారణాసి-బీహెచ్‌యూ ఐటీ నిపుణుల సహకారం తీసుకోవడం విశేషం. ఈ యాప్‌తో తొలిసారిగా ఇటీవల నాగార్జునసాగర్‌లో మిస్ వరల్డ్ సుందరీమణుల పర్యటన బందోబస్తును చేపట్టి సక్సెస్ అయ్యారు. స్మార్ట్ పోలీసింగ్ సేవలవైపు అడుగులు వేస్తూ దేవరకొండ పోలీసులు ఏఐ టెక్నాలజీతో పోలీసు సిబ్బంది డ్యూటీలతోపాటు బందోబస్తు చర్యలను పర్యవేక్షించేందుకు స్పాట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మౌనిక తన పరిధిలోని సిబ్బంది పనితీరు మెరుగపడేలా, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా, వీఐపీ టూర్స్, మెగా ఈవెంట్స్‌లో పకడ్బందీగా బందోబస్తు చేపట్టేలా దృష్టి సారించారు. ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీ సహకారంతో మెరుగైన సేవల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తనకున్న టెక్నాలజీ అనుభవంతోపాటు ఐటీ నిపుణులతో సంప్రదింపులు చేపట్టారు. ఇందులోభాగంగా ఐఐటీ వారణాసి-బీహెచ్‌యూకు చెందిన ఐటీ నిపుణులు మానిష్ వర్మ, శివసాయి సహకారం తీసుకున్నారు.
మౌనికతోపాటు వీరిద్దరూ కలిసి ఏఐ ద్వారా బందోబస్తు చర్యల కోసం ప్రత్యేకంగా SPOT(SECURITY PERSONAL ON TRACK) అనే యాప్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా వీఐపీ టూర్స్, పెద్ద ఈవెంట్లలో పోలీస్ సిబ్బంది విధుల కేటాయింపు, పనితీరు, పర్యవేక్షణతోపాటు సమర్థవంతమైన సేవలను వినియోగించుకుంటున్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆధ్వర్యంలో దేవరకొండ ఏఎస్సీ మౌనిక రూపొందించిన స్పాట్ యాప్‌ను ఇటీవల తొలిసారి సాగర్‌లో జరిగి న మిస్ వరల్డ్ ఈవెంట్ సమయంలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి మంచి ఫలితాలు సాధించారు.
యాప్ పని చేసే తీరు…
స్పాట్ యాప్‌లో జియో-ఫెన్సింగ్ టెక్నాలజీని వినియోగించారు. దీని ద్వారా బందోబస్తు విధుల్లో భాగంగా ప్రతి పోలీస్ సిబ్బందికి 100 మీటర్ల పరిధిలో పని చేసే ప్రాంతా న్ని కేటాయిస్తారు. ఆ పరిధి దాటి ఆ సిబ్బంది బయటకు వెళ్లినా, వేరే పనుల్లో నిమగ్నమైనా యాప్ వెంటనే సంబంధిత పర్యవేక్షణ అధికారిని అలర్ట్ చేస్తోంది. ఇది రియల్‌టైమ్‌లో పర్యవేక్షణకు ఏంతో తోడ్పడుతుంది.
స్పాట్ యాప్ ఫీచర్లు
మెరుగైన సేవలకు ఎంతో తోడ్పాటు
కీలకమైన బందోబస్తు సమయాల్లో పోలీసుల విధి కత్తిమీద సాములా మారుతుంది. వీఐపీ టూర్స్, మెగా ఈవెంట్స్‌లో ఎక్కడా చిన్న పొరపాటు జరిగినా డిపార్ట్మెంట్ పరంగా చాలా ఇబ్బంది. ఆ సమయంలో పోలీసు సిబ్బంది పనితీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించ డం సాధ్యం కాదు. అందుకే ఏఐ టెక్నాలజీపై దృష్టి సారించాం. ఐఐటీ వారణాసీ ఐటీ నిపుణలు సహకారంతో స్పాట్ యాప్‌ను ఆవిష్కరించాం. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆధ్వర్యంలో స్పాట్ యాప్‌తో సాగర్‌లో మిస్ వరల్డ్ పోటీదారుల బందోబస్తును పర్యవేక్షించాం. మంచి ఫలితాలు సాధించాం. పోలీసు సిబ్బంది పనితీరు మెరుగపడేందుకు, సేవల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకు యాప్ ఎంతో తోడ్పడుతుంది.
– ఏఎస్సీ మౌనిక