Congress Govt | అలివికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆచరణను మరిచి ప్రచార ఆర్బాటంపై దృష్టి పెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచార యావతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తుండడంపై జనం మండిపడుతున్నారు. 30 శాతం కూడా పూర్తి చేయని రైతుభరోసా, నలభై శాతం కూడా కాని రుణమాఫీ పథకాల అమలు ప్రచారం కోసం ప్రభుత్వం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.5 కోట్లకుపైగా ఖర్చు చేస్తుండడం విడ్డూరం. ఈ రెండు పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామగ్రామాన లబ్ధ్దిదారుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేసేందుకు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రజలకు ఏది అవసరమో అది అందించారు. ఏ ఒక్కరూ అడగకుండానే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేశారు. ఆరు గ్యారెంటీలు, అనేక హామీలతో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. కేసీఆర్ సర్కారులో ప్రజలకు అందిన పథకాలను సైతం కొనసాగించని దుస్థితి.
పలు పథకాలను గొప్పగా ప్రారంభించి మధ్యలోనే మంగళం పాడుతున్నది. పైగా, అరకొరగా అమలు చేసిన పథకాలను ఏదో గొప్పగా చేసినట్లు ప్రచారం చేసుకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. రైతుభరోసా, రుణమాఫీ అందని రైతులు ఉమ్మడి జిల్లాలో లక్షల్లో ఉన్నారు. కానీ, ఇప్పటికే ఇచ్చిన కొద్దిమంది లబ్ధ్దిదారుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలను గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సూర్యాపేట జిల్లాలో 481, నల్లగొండ జిల్లాలో 868, యాదాద్రి భువననగిరి జిల్లాలో 421 గ్రామపంచాయితీలు ఉండగా, మొత్తం 1771 పంచాయతీల్లో 6×4 సైజులో ఫ్లెక్సీల ఏర్పాటు చేయనున్నారు. ఫ్లెక్సీలో పట్టే పేర్లను బట్టి ఎన్ని అవసరపడతాయో అన్నింటిని మూడు చోట్ల ఏర్పాటు చేస్తారు. ఇలా సూర్యాపేటలో 52 వేలు, నల్లగొండ జిల్లాలో 61,089, యాదాద్రి భువనగిరి జిల్లాలో 39వేలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు.
ఒక్కో ఫ్లెక్సీకి రూ.300 నుంచి 350 రూపాయల ఖర్చు అవుతుందనే అంచనాలతో ఇప్పటికే మూడు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.5కోట్లతో ఎస్టిమేషన్లు పూర్తి చేసి టెండర్లు పిలిచినట్లు సమాచారం. కాగా, అంతంతమాత్రంగా అమలు చేసిన రైతుభరోసా, రుణమాఫీపై ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం అంటే ప్రజా ధనం వృధా చేయడం తప్ప మరోటి కాదని రైతులు మండిపడుతున్నారు. అందుకయ్యే ఖర్చుతో కొద్దిమంది రైతులకైనా లబ్ధి చేకూర్చవచ్చనే చెప్తున్నారు.
కాంగ్రెస్తో రైతులకు ఒరిగిందేమీ లేదు
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, నాయకుల ప్రచార ఆర్భాటం తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. రైతు భరోసా రైతులకు అందనేలేదు. ఇప్పటి వరకూ ఏ ఊళ్లోనూ రుణమాఫీ పూర్తిగా జరుగలేదు. చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా అందడం లేదు. కేవలం వానకాలానికి సంబంధించి, అదీ కొద్దిమందికే రైతు భరోసా ఇచ్చారు. యాసంగి సంబంధించి పెట్టుబడి సాయం ఊసేలేదు. పంట చేతికి వచ్చినా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర కంటే తక్కవ మిల్లులకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తున్నది. ఇవన్నీ పట్టించుకోవడం మాని అరకొర పనులకు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది.
– పెరుమాళ్ల సతీశ్, రైతు, యల్లాపురం, పాలకవీడు మండలం