గుండాల, మే 24 : యాదాద్రి భువనగిరి జిల్లా డీసీఓ జి.మురళీరమణ గుండాల పీఏసీఎస్ పాలకవర్గానికి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. పీఏసీఎస్ పరిధిలో సుద్దాల గ్రామంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణంపై వచ్చిన అభియోగాల విషయంలో చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు 11 మంది డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చారు. సుద్దాల గ్రామంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణంలో సహకారం చట్టం-1964లోని సెక్షన్ 21(ఎ)(డి) రూల్ 24(1)(సి) నియమ నిబంధలను పాటించలేదని డీసీఓ నోటీసులో పేర్కొన్నారు. సుద్దాల గ్రామంలో నిర్మించే పెట్రోల్ బంక్ నిర్మాణం, సివిల్ వర్క్‌ను సహకార చట్టానికి విరుద్ధంగా పాలకవర్గం 2023 డిసెంబర్ 27న పాలకవర్గ సభ్యుడైన ఎగమాటి విద్యాసాగర్‌రెడ్డికి లక్షల విలువజేసే కాంట్రాక్టును కట్టబెడుతూ తీర్మానం చేశారు.
సహకార చట్టం ప్రకారం పాలకవర్గ సభ్యులు సంఘం ద్వారా నిర్వహించే ఎటువంటి లావాదేవీల్లో ఒప్పందం చేసుకోకూడదని, స్వయంగా పనులను చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఉల్లంఘించి తీర్మానం చేసినట్లు నోటీసులో పొందుపర్చారు. మోత్కూర్ సహకార సంఘ ఇన్సెక్టర్, ఫీల్డ్ అధికారి విచారణ జరిపి గుండాల పీఏసీఎస్ రికార్డులను పరిశీలించగా నిబంధల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ కావడంతో పర్సన్ ఇన్చార్జి చైర్మన్ లింగాల భిక్షం, పర్సన్ ఇన్చార్జి సభ్యులు పురుగుల యాదలక్ష్మి, మందడి రామకృష్ణారెడ్డి, జంపాల కొమురయ్య, పొన్నగాని అంజయ్య, బండారి శ్రీనివాస్, ఎగమాటి విద్యాసాగర్‌రెడ్డి, చాడ పెంటమ్మ, సంగి పెద్ద బాలకొమురయ్య, అంగిడి బక్కయ్య, సింగారం ఉప్పలయ్య, గోల్కొండ సువర్ణ, పాలడుగు చిన్న అయిలయ్యకు నోటీసులు అందజేశారు.
నోటీసులను సభ్యులకు అందించి వారి సంజాయిషీని మూడు రోజుల వ్యవధిలో డీసీఓ కార్యాలయానికి పంపించేలా చర్యలు తీసుకోవాలని డీసీఓ మురళీరమణ గుండాల పీఏసీఎస్ సీఈఓ నాగయ్యను ఆదేశించారు. దాంతో శనివారం పలువురు డైరెక్టర్లు తమ వివరణ లేఖలను డీసీఓ కార్యాలయంలో అందజేశారు. పలువురు డైరెక్టర్లు వారి వివరణ లేఖలో సంఘం సభ్యుడిగా ఉంటూ కాంట్రాక్టు పనులు నేరుగా చేయవద్దన్న విషయం తమకు తెలియదని, సీఈఓ నాగయ్య తమకు నియమ నిబంధనలు చెప్పకుండానే తీర్మానం చేయించారని డీసీఓకు రాతపూర్వకంగా సంజాయిషీ ఇచ్చారు.