యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్‌కుమార్
మోత్కూరులో 10 మందికి వాహనాలు అందజేత
మోత్కూరు, జూన్ 5 : దళిత బిడ్డల బాగు కోసమే ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని 23మంది నిరుపేదలను ప్రభుత్వం దళిత బంధు యూనిట్లకు ఎంపిక చేయగా వారిలో 10మంది లబ్ధిదారులకు కార్లు, ట్రాక్టర్లు, టాటా ఏస్ మోపెడ్లను మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు.
స్వరాష్ట్రంలో దళితులను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించడానికి ప్రభుత్వం రూ.10లక్షలతో యూనిట్లు అందిస్తున్నదన్నారు. నిరుపేదల కష్టం సీఎం కేసీఆర్‌కు తెలుసునని, వారి ఆర్థిక సమానత్వం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఇతరులకు ఉపాధి చూపుతూ అభివృద్ధి చెందాలన్నారు. గత బడ్జెట్లో నియోజకవర్గానికి వంద యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. తిరుమలగిరి మండలాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 2500 కుటుంబాలకు దళిత బంధును వర్తింపజేసిందన్నారు. ప్రస్తుత బడ్జెట్లోనూ ప్రభుత్వం మరో 1500యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రతి గ్రామానికీ 10యూనిట్ల చొప్పున అందించడానికి కృషి చేస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యాంసుందర్, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, జడ్పీటీసీ గోరుపల్లి శారద, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకుబ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీ.శ్రీకాంత్, ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ సూపరింటెండెంట్ శ్రవణ్, మున్సిపల్ కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి, పురుగుల వెంకన్న, వనం స్వామి, రజిత పాల్గొన్నారు.