హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం నారా చంద్రబాబును సోమవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్టు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలుపడానికి సహకరించాలని, తిరుమలలో తెలంగాణకు ఐదెకరాల స్థలం కేటాయించాలని కోరినట్టు పేర్కొన్నారు.
సత్తుపల్లి, కొవ్వూరు రైల్వేలైన్, పెనుబల్లి, అమరావతి రైల్వేలైన్ నిర్మాణానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. ఖమ్మం జిల్లాలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి, పెద్దవాగు మరమ్మతుల కోసం అయ్యే ఖర్చులో 85శాతం నిధులను విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. భద్రాచలం ముంపు బారిన పడకుండా ఏపీలో నిర్మించిన కరకట్టకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరినట్టు తుమ్మల వెల్లడించారు.