నందికొండ, జులై 29 : శ్రీశైలం రిజర్వాయర్‌లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో త్వరలో నాగార్జునసాగర్ రిజర్వాయర్ జలకళను సంతరించుకోనున్నది. కృష్ణానది ఎగువన ఉన్న పరీవాహక ప్రాజెక్టుల్లోని జూరాల రిజర్వాయర్ క్రస్టు గేట్ల ద్వారా దిగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌కు నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలంలో ప్రస్తుతం 1,42,382 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
ఈ ఏడాదిలో నాగార్జునసాగర్ నీటి మట్టం 511 అడుగుల మేరకు చేరుకోగా శ్రీశైలం నుంచి కొనసాగుతున్న ఇన్‌ఫ్లోతో 3 అడుగుల మేర పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులో జలాశయ నీటిమట్టం 885 ( 215.807 టీఎంసీలు) అడుగులకుగాను 869.80 (140.6495 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. రోజుకు రెండు అడుగుల మేర నీటి మట్టం పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగుతే మరో పదిరోజుల్లో శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయికి చేరుకొని క్రస్ట్ గేట్ల ద్వారా నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది. సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం 590 ( 312.50 టీఎంసీలు) గాను ప్రస్తుతం 514.20 అడుగులు వద్ద 138.9118 టీఎంసీలు నిల్వ ఉంది.
గత ఏడాది ఇదే సమయానికి 504 అడుగుల వద్ద 122.0338 టీఎంసీలు నిల్వ ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది రిజర్వాయర్‌లో నీటి మట్టం 10 అడుగుల మేర ఎక్కువగా ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో ఇదే స్థాయిలో కొనసాగితే జల విద్యుత్ కేంద్రాలు, క్రస్ట్ గేట్ల ద్వారా వరద నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరే అవకాశం ఉంది. వర్షాకాలం గడువు ఆగస్టు వరకు ఉండడం తో నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం పుష్కలంగా ఉండడంతో ఎడమ కాల్వ ఆయకట్టు కింద రైతులకు పంట సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రెండు పంటలకు నీరందించే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు చెపుతున్నారు..
డ్యాంను సిద్ధం చేశాం
కృష్ణాపరీవాహక ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం పుష్కలంగా ఉంది. డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ కమిటీ సూచనల ప్రకారం డ్యాం పటిష్టతకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాం. డ్యాం క్రస్టు గేట్ల రబ్బర్సీలింగ్, రోప్‌వైర్లు మార్పిడి, గేట్లు, మోటార్ల మరమ్మతులు, అయిలింగ్, నిర్వహణ పనులను పూర్తి చేశాం. రానున్న వరదలను ఎదుర్కొనేందుకు డ్యాంను సిద్ధం చేశాం. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి మంచి ఫలితాలు ఇస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశానుసారం వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో పంటలకు నీటిని విడుదల చేస్తాం.
– మల్లికార్జునరావు, డ్యాం ఇన్చార్జి