అర్వపల్లి, డిసెంబర్ 02 : ఇసుక ట్రాక్టర్ అతివేగంతో బైక్‌పై వెళ్తున్నవ్యక్తిని వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అర్వపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్వపల్లికి చెందిన గద్దగూటి మల్లయ్య (47) బంధువుల ఫంక్షన్ కు బైక్ పై వెళ్తున్నాడు. సూర్యాపేట వైపు ఇసుక లోడుతో ట్రాక్టర్ అతివేగంగా వెళ్తూ బైక్‌ను వెనుక నుండి ఢీకొట్టడంతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై గంటసేపు మృతదేహంతో ధర్నా నిర్వహించారు. నాగారం సీఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. మల్లయ్య నాగారం మండలం ఫణిగిరి సబ్ స్టేషన్ లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు.

Aravapally : ఇసుక ట్రాక్టర్ ఢీకొని కరెంట్ ఆపరేటర్ దుర్మరణం
అర్వపల్లి పరిసరాల్లో ఇసుక రీచ్ కార్యకలాపాల పేరుతో ట్రాక్టర్ల అక్రమ రేస్ నడుస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్లు స్పీడ్ లాక్‌లు తీసేసి వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతున్నారని ప్రజల నుండి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ వారు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా, ట్రాఫిక్ నియంత్రణ, చెక్‌పోస్ట్ వ్యవస్థ, వేగ నియంత్రణ ఏవీ అమలు కావడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రతిరోజు ట్రాక్టర్ల క్యూలు, మరిన్ని ట్రిప్పులు ఇవ్వాలన్న పోటీతో సాధారణ ప్రయాణీకులు, పాఠశాల విద్యార్థులు, మహిళలు భయంతో ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇసుక ట్రాక్టర్ల వేగానికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Aravapally : ఇసుక ట్రాక్టర్ ఢీకొని కరెంట్ ఆపరేటర్ దుర్మరణం