
చందంపేట, జనవరి 1: వానకాలంలో పత్తి సాగు తప్ప రెండో పంట వారికి తెలియదు. మెట్ట ప్రాంతాలు.. నీటి కష్టాలు.. విద్యుత్ కోతలు.. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా ఒక పంటతోనే సరిపెట్టుకున్న గిరిజనులు గడిచిన మూడేండ్లుగా రెండో పంటనూ సాగు చేస్తున్నారు. పెరిగిన భూగర్భ జలాలు, రైతు బంధు పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్ వారికి వరంలా మారాయి. దాంతో యాసంగిలో అందరూ ఏకతాటిపై నిలిచి సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా వరి వదిలేసి పల్లి సాగు చేస్తున్నారు. –
‘ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఫ్రీ కరంటు, రైతు బంధు డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నడు.. అందుకని మా తండా అంతా ఒకే పంట వేయాలని అనుకున్నాం. గతంలో రెండో పంట మాకు తెల్వదు. ఈ మధ్య కాలంలో మూడు నాలుగేండ్లుగా రెండో పంటగా పల్లి సాగు చేసి లాభాలు పొందుతున్నం’ అని చందంపేట మండలం హంక్యా తండా రైతులు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన సుమారు 120 కుటుంబాల్లో 100 మందికి పైగా 600 ఎకరాల్లో రెండో పంటగా వేరుశనగ సాగు చేశారు. రికార్డు స్థాయిలో వేరుశనగ సాగు చేసి ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలిచారు.
హంక్యాతండా రైతులు 60 ఏండ్లుగా నీరు లేక కేవలం పత్తి సాగు చేసేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా గ్రామ సమీపంలో చెన్నయ్య కుంట చెరువులో పూడిక తీయడంతో నీరు చేరింది. భూగర్భ జలాలు పెరుగడంతో మూడేండ్లుగా బోర్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు.
‘ఒకప్పుడు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కూలి పనులు చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అందరికీ చేతి నిండా పని ఉండడంతో కూలీలు దొరుకడం లేదు’ అని రైతులు పేర్కొంటున్నారు. ఒక్కో రైతు 5నుంచి 8 ఎకరాల్లో పల్లి సాగు చేయగా సుమారు 200-350 బస్తాల దిగుబడి వస్తుందని చెప్తున్నారు. హంక్యా తండా రైతులను ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల ఆవాసాలైన లెడప తండా, కుమ్మరిగూడెం, పాతవూరి తండా రైతులు కూడా పల్లి సాగు చేస్తున్నారు.
కేసీఆర్ సార్ ఇచ్చిన పైసలతోనే పల్లి సాగు..
నాకు ఐదెకరాలు ఉంది. బోరు కింద రెండో పంటగా పల్లి వేశాను. వరి సాగు చేద్దామనుకుంటే కేంద్ర ప్రభుత్వం కొనట్లేదని అధికారులు వద్దన్నరు. అందుకే నేను పల్లి సాగు చేశాను. వానకాలంలో 40 క్వింటాళ్ల పత్తి వచ్చింది. యాసంగిలో పల్లి 200-300 బస్తాల దిగుబడి వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇస్తున్న పంట పెట్టుబడితోనే పొలాన్ని దున్నించి పైపులు కొన్నా. నాకున్న ఐదెకరాలకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.50 వేలు వస్తుంది. అంతకంటే ఇంకేం కావాలి నాకు. సారిచ్చిన పైసలతోనే పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తున్నాను.
అందరూ పల్లి సాగుచేస్తున్నరు..
మా తండాలో రైతులంతా పల్లి సాగు చేస్తున్నరు. మమ్మల్ని చూసి మా చుట్టుపక్కల తండావాళ్లు కూడా పల్లీలే పెట్టినరు. మూడు నాలుగేండ్లుగా యాసంగిలో వరి సాగు చేసేవాళ్లం. ఇప్పుడు పంట మార్పిడి కింద రెండో పంటగా పల్లి సాగు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ సారు చెప్పిన మాటనే మేమందరం పాటిస్తున్నం. క్వింటా పల్లి విత్తనాలు రూ.12 వేలకు కొన్నాం. రూ. 60 వేలు పెట్టి పల్లి కొని 5ఎకరాల్లో సాగు చేసిన. పెట్టుబడి మొత్తం రూ.లక్ష పోను రూ.3 లక్షలు లాభం వస్తది.
చెరువు నిండి బోర్లు పోస్తున్నయి..
మిషన్ కాకతీయ కార్యక్రమం కింద మా ఊరి చెరువును బాగు చేసినరు. పూడిక తీయడం వల్ల నీళ్లు నిల్వ ఉంటున్నయి. బోర్లు ఎండిపోకుండా ఉంటున్నాయి. బోర్ల కిందనే రెండు పంటలు సాగు చేస్తున్నం. అవసరమున్నప్పుడల్లా పల్లి పంటకు నీళ్లు పెడుతున్నం. ఉచిత కరంటు ఉన్నందుకు పెట్టుబడి ఖర్చు తగ్గింది. మేము ఏ పంట వేసినా మంచి దిగుబడి వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదేండ్లుగా పంటలు బాగ పండుతున్నయి.