– యువకులను మభ్యపెట్టి నేరాల వైపు మళ్లించి, శిక్షణ ఇచ్చిన కరుడుగట్టిన నేరస్థుడు
– 8 మంది అంతర్రాష్ట్ర చోరీ ముఠాలో 6 మంది అరెస్ట్
– రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 చోరీలు
– రూ.53 లక్షల విలువ చేసే 260 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కేజీల వెండి, రూ.1,50,000/- నగదు, రెండు టీవీలు, రెండు సౌండ్ బార్స్, 5 బైక్‌లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నీలగిరి, జూలై 18 : రెండు తెలుగు రాష్ట్రాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర నేరస్థుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు రూపొందించిన నేర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుండి 260 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కేజీల వెండి, రూ.1,50,000/- నగదు, రెండు టీవీలు, రెండు సౌండ్ బార్స్, 5 బైక్‌లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులను తమ్మిశెట్టి నాగరాజు(32), అల్లంశెట్టి సాయి కిరణ్ @ పాండు(22), సమంతపు వెంకట అశోక్(33), ఆలేటి కోటేశ్వర్ రావు(22), సపావత్ నాగ కిరణ్ బాబు నాయక్(31), పిల్లి రాజేష్(25) గా గుర్తించారు. మరో ఇద్దరు నిందితులు గాడిబోయిన గోపి సాయి(22), తమ్మండ్ర రమేష్(34) పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.
ఇటీవల అరెస్టైన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు భూష్మి శ్రీకాంత్‌ను విచారించగా అతని నేర కార్యకలాపాలకు సంబంధించిన అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. శ్రీకాంత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణలో 28, ఆంధ్రప్రదేశ్ లో 12 మొత్తం 40 చోరీ కేసులకు పాల్పడిన అతని ముఠాను పట్టుకునేందుకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం.జితేందర్ రెడ్డి, డి.చంద్రశేకర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సిఐ పీఎన్డీ ప్రసాద్, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ ఆంజనేయులు, మాడ్గులపల్లి ఎస్ఐ సురేశ్ యాదవ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ముఠాలోని ఆరుగురు సభ్యులను పిడుగురాళ్ల, అంజనీపురం, మండేపూడి(v) అమరావతిలో ఈ ఉదయం సుమారు 9.00 గంటలకు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నేరస్థుడు ఎంత తెలివిగా ముఠాను నిర్మించినా, ఎంత జాగ్రత్తగా నేరాలకు పాల్పడినా చట్టం నుంచి తప్పించుకోలేడన్నారు. ప్రతి చిన్నఆధారాన్నికీలక సమాచారంగామలిచి నిరంతర దర్యాప్తు ఫలితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమర్థమైన దర్యాప్తు, ప్రజల సహకారంతో ప్రతి నేరస్థుడిని చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. యువత తప్పుడు ప్రలోభాలకు లోనై నేరాల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ నేర సామ్రాజ్యం బట్టబయలు