మునుగోడు, నవంబర్ 10 : దేశ స్వతంత్ర్యం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పోరాటాలను, త్యాగాలను నేటి యువ తరానికి గుర్తు చేయడం కోసం గద్వాల నుండి ఖమ్మం వరకు నిర్వహించే జాతను విజయవంతం చేయాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మిక, విద్యార్థి, రైతు, మహిళ, వ్యవసాయ కార్మిక, యువజన తదితర అనేక ప్రజా సంఘాలను నిర్మించి ఆయా వర్గాల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ రాజీలేని పోరాటాలు నిర్వహించిందని తెలిపారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణ త్యాగాలతో 3 వేల గ్రామాల్లో భూస్వాముల, దొరల ఆగడాల నుండి ప్రజలకు విముక్తి కల్పించి భూమిలేని నిరుపేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిన మహోత్తర చరిత్ర కలిగిన పార్టీ అని గుర్తు చేశారు. 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో మండల పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తీర్పాలి వెంకటేశ్వర్లు, జిల్లా సమితి సభ్యులు సురికి చలపతి బొమ్మరి పైన లాలు, మాజీ జడ్పీటీసీ గోస్కొండ లింగయ్య, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, మందుల పాండు, బండమీది యాదయ్య, ఉప్పునూతల రమేశ్, కాగిత వెంకన్న, దుబ్బ ఎంకన్న, బండారు శంకర్, పులకరం ఆంజనేయులు, ఉదయ్ పాల్గొన్నారు.