వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. నల్లగొండలోని ఐటీ హబ్ వెనుక ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్ల పూర్తయ్యాయి. సాధారణ ఎన్నికల మాదిరి కాకుండా మండలి ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా కొనసాగనుంది. ఓటింగ్‌లో ప్రాధాన్యత ప్రకారం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా, కౌంటింగ్ కూడా అదే విధంగా చేపట్టనున్నారు. ముందుగా పోలైన బ్యాలెట్లు అన్నింటినీ కట్టలుగా కట్టి తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్లను మొదట లెక్కిస్తారు. ఆ సమయంలోనే చెల్లని ఓట్లను పక్కకు వేస్తారు. చెల్లిన ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ విజేతకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. చెల్లిన ఓట్లల్లో యాభై శాతం ప్లస్ ఒకటి కలిపి విజేతకు అవసరమైన గెలుపు కోటాను నిర్ధారిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఈ గెలుపు కోటాను అభ్యర్థులు సాధిస్తే సరి. లేకుంటే ఎలిమినేషన్ పద్ధతిలో సుదీర్ఘంగా గెలుపు కోటా వచ్చే వరకు లెక్కింపు కొనసాగుతుంది.
ఓట్ల లెక్కింపు సరిగ్గా సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. మొత్తం ఓటర్లలో 93.57 శాతం ఓటింగ్‌తో 24,139 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ పూర్తి కాగానే 12 జిల్లాల్లోని 200 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను నల్లగొండలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 6 గంటలకే ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు లెక్కింపు కేంద్రానికి చేరుకోనున్నారు. వారి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి కౌంటింగ్ కేంద్రానికి సీరియల్ ప్రకారం బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్‌కు తరలించనున్నారు. ఓట్ల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే కౌంటింగ్ హాల్‌ను సిద్ధ్దం చేశారు. ఇందులో ఓట్ల లెక్కింపు కోసం 25 కౌంటింగ్ టేబుళ్లు, ఒక రిటర్నింగ్ అధికారి టేబుల్‌ను ఏర్పాటు చేశారు.
మొత్తం 200 పోలింగ్ కేంద్రాల్లో కేంద్రానికి ఒక బ్యాలెట్ బాక్స్ లెక్కన మొత్తం 200 బ్యాలెట్ బాక్సులను పోలింగ్‌కు వినియోగించారు. వాటిని పోలింగ్ కేంద్రాల సీరియల్ నెంబర్ ప్రకారం ఒక్కో కౌంటింగ్ టేబుల్‌కు ఒక బ్యాలెట్ బాక్సును అందజేస్తారు. ఇలా ఒక్కో రౌండ్లో 25 టేబుళ్లపై 25 బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కడుతారు. ఒక్కో రౌండ్లో 25 అంటే మొత్తం 200 బాక్సులు పూర్తి కావాలంటే 8 రౌండ్లలో కట్టలు కట్టే కార్యక్రమం కొనసాగుతుంది. బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లను టేబుల్‌పై కుప్పగా పోసి 25 పేపర్లను ఒక కట్టగా కట్టి బండిల్స్ చేస్తారు. ఇలా మొత్తం బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి కట్టలు కడుతారు. ఎప్పటికప్పుడు బండిల్స్‌ను తీసుకెళ్లి ఆర్ఓ టేబుల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రమ్‌లో వేస్తారు. బండిల్ కట్టడం మొత్తం పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. బండిల్స్ కట్టే పనికే కనీసం మూడు గంటల సమయం పట్టవచ్చని అంచనా. ఉదయం 11 గంటల వరకు ఇది పూర్తయితే ఆ తర్వాతే అసలు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.
అనుకున్న విధంగా ఉదయం 11 గంటల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ ముగిస్తే… తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో టేబుల్‌కు 40 బండిల్స్ చొప్పున ఇస్తూ వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 25 టేబుళ్లపై ఒక్క రౌండ్లోనే పోలైన 24,139 ఓట్ల లెక్కించనున్నారు. ఇదే సమయంలో చెల్లని ఓట్లను సైతం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సులో వేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అంచనా. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సాయంత్రం 5 గంటల వరకు పూర్తి కావచ్చు. ఇది పూర్తయ్యాక చెల్లని ఓట్ల లెక్క తేల్చి మొత్తం చెల్లిన ఓట్లలో 50శాతం+1ని గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఉదాహరణకు మొత్తం ఓట్లలో 24వేల ఓట్లు చెల్లుబాటైతే అందులో సగం అంటే 12000+1=12001 ఓట్లు వచ్చిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాకపోతే అప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.
ఎలిమినేషన్ ప్రక్రియ విభిన్నంగా కొనసాగనుంది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించే సమయంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికైతే తక్కువ తొలి ప్రాధాన్యతా ఓట్లు వస్తాయో.. వారి ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను ముందుగా లెక్కించి ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. తొలి ఓట్లలో చివరి స్థానంలో నిలిచిన అభ్యర్థికి పోలైన ద్వితీయ ఓట్లు.. ఏ అభ్యర్థులు పొందినవి వారికి కేటాయిస్తారు. ఇంకా కూడా కోటా రాకపోతే చివరి తక్కువ తొలి ప్రాధాన్యత వచ్చిన రెండో అభ్యర్థికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పరిగణిలోకి తీసుకుని మిగతా వారికి పంచేస్తారు. ఆయా అభ్యర్థుల తొలి ప్రాధాన్యత ఓట్లకు ఎలిమినేషన్ ప్రక్రియలో వస్తున్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కులుపుకొంటూ ముందుకు వెళ్తారు. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో గెలుపు కోటా వచ్చే వరకు కింది నుంచి పైకి అందరి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ వెళ్తారు. ఈ క్రమంలో ఎక్కడైనా ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్‌ను నిలిపివేసి విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే తృతీయ ప్రాధాన్యతా ఓట్లును కూడా లెక్కించక తప్పదు. కిందటిసారి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి గెలుపు కోటా ఓట్లకు కేవలం 38 ఓట్ల దూరంలో నిలిచారు. దాంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తుది ఫలితం వెల్లడైంది.
ఈసారి ఫలితం తేలడానికి ఎక్కువ సమయమే తీసుకోవచ్చు. ప్రధాన అభ్యర్థుల్లో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, టీచర్స్ జాక్ అభ్యర్థి పూల రవీందర్, బీజేపీ అభ్యర్థి సర్వోత్తంరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, కుడా మాజీ చైర్మన్ సుందరరాజు తమకు భారీగా ఓట్లు పోలైనట్లు అంచనా వేస్తూ విజయంపై ఎవరి ధీమాను వారు ప్రదర్శిస్తున్నారు. నిజంగానే వీరి అంచనా ప్రకారం ఓట్లు పోటాపోటీగా పోలైతే ఫలితం అంత ఈజీగా తేలకపోవచ్చు. ఎవరికీ గెలుపు కోటా చేరుకోవడం అంత సులభం కాకపోవచ్చు. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎలిమినేషన్ రౌండ్ కూడా సుధీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆరుగురిలో నలుగురు అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తే తప్ప తుది ఫలితం వెల్లడి కాకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే తుది ఫలితం వెలువడే సరికి సోమవారం రాత్రి కావచ్చని భావిస్తున్నారు.