నకిరేకల్, జూలై 12 : ప్రపంచీకరణ ముప్పు చిన్న పట్టణాలకూ వ్యాపించి పెద్ద పెద్ద అంగళ్లు, షాపింగ్ మాల్స్ వీధి వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నట్లు రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య తెలిపారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కోరారు. నకిరేకల్ పట్టణంలోని రహదారి బంగ్లా వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం కామర్స్ విభాగం విద్యార్థులు వీధి వ్యాపారుల జీవనోపాధిపై చేసిన సర్వే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లాభాపేక్ష లేకుండా చిన్నమొత్తంతో రోడ్ల పక్కన సరుకులను విక్రయిస్తూ కుటుంబాల్ని పోషించుకుంటున్న చిరు వ్యాపారుల సాదక బాదకాలను సర్వేలో విద్యార్థులు సమగ్రంగా అధ్యయనం చేయాలని విద్యార్థులకు సూచించారు.
డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ.. వీధి వ్యాపారుల జీవనోపాధిపై జరుగుతున్న రెండు రోజుల సర్వే విద్యార్థులు భవిష్యత్లో మంచి పరిశోధకులుగా మారేందుకు దోహదపడగలదన్నారు. క్షేత్రస్థాయిలో వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ తెలుసుకోవడమే కాకుండా పరిష్కార మార్గాలను సూచిస్తూ విద్యార్థులు సర్వే నివేదిక రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామర్స్ సీనియర్ అధ్యాపకుడు సీహెచ్ శ్రీను, అధ్యాపకులు ఉపేందర్, శివశంకర్, నర్సింహాచారి పాల్గొన్నారు.