Cornea Donation | చనిపోయిన ఓ వ్యక్తి నేత్రదానంతో బతికి ఉన్న ఇద్దరి కండ్లల్లో వెలుగులు నింపవచ్చన్న నినాదంతో నల్లగొండ కేంద్రంగా నేత్రదానం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్నది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కార్నియాలు సేకరిస్తూ సంబంధిత ఆస్పత్రులకు అందిస్తూ అంధుల కండ్లకు చూపునిస్తున్నారు. చనిపోయిన వ్యక్తితోపాటు భూమిలో వృథాగా కలిసిపోయే కండ్లను సేకరించడం ద్వారా చూపుకోసం ఎదురుచూస్తున్న ఎంతో మందికి ఉపశమనం కలిగిస్తున్నారు. నల్లగొండలోని లయన్స్ క్లబ్ భవనం కేంద్రంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరు నెలలుగా నేత్రదాన కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతున్నది. గతేడాది ఆగస్టు 1 నుంచి నేత్రదానానికి శ్రీకారం చుట్టిన బృందం ఇప్పటి వరకు 75 మంది మృతుల నుంచి కార్నియాలు సేకరించింది. ప్రారంభంలో ప్రజల నుంచి అంతగా స్పందన లేకపోవడంతో కొంత మందకొడిగా మొదలైనా ప్రస్తుతం ఫిబ్రవరిలో రోజుకు ఒకరి నుంచి కార్నియా సేకరణ జరుగుతుండడం విశేషం.
ప్రస్తుత పరిస్థితుల్లో అవయవదానం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పెరుగుతున్న వ్యాధులు, అనారోగ్యాల కారణంగా ఎంతో మందికి గుండె, కాలేయం, కిడ్నీ, కండ్ల లాంటి అవయవాల అవసరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అవయవదానానికి సైతం విస్తృత ప్రచారం లభిస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో చాలా సులువైన నేత్రదానం కార్యక్రమంపైన నల్లగొండలోని లయన్స్ క్లబ్స్ అండ్ ఐఎంఏ వైద్యబృందం సభ్యులు దృష్టి సారించారు. ఒక అంచనా ప్రకారం దేశంలో 85 లక్షల నుంచి 95లక్షల మంది అంధులు ఉంటే వీరిలో 13 లక్షల నుంచి 15 లక్షల మంది వరకు కార్నియా అనే కంటి పొర లేక ప్రపంచాన్ని చూడలేక పోతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏడాదికి సుమారు 45వేల వరకు మాత్రమే కార్నియాల సేకరణ జరుగుతున్నది. ఇదే ప్రకారం చూస్తే ప్రస్తుతం ఉన్న వారిందరికీ చూపు ప్రసాదించాలంటే కనీసం 30 సంవత్సరాలు సమయం తీసుకోనుంది. దీనికి తోడు మళ్లీ ప్రతి సంవత్సరం కొత్తగా 28వేల మంది వరకు కార్నియా అంధత్వం ఉన్న వారూ రిజిస్టర్ అవుతున్నారు. దీంతో కార్నియా సేకరణ అనేది దేశంలో అత్యావశ్యకత సంతరించుకుంది. అందువల్ల నల్లగొండ లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ దీనిపై దృష్టి సారించి ప్రజల్లోకి వెళ్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నది. ట్రస్ట్ చైర్మన్‌గా కేవీ ప్రసాద్ కొనసాగుతుండగా ఎండీగా ఉన్న డాక్టర్ హారినాథ్, మేనేజర్‌గా వ్యవహారిస్తున్న డాక్టర్ పుల్లారావు, కౌన్సిలర్‌గా చిరునోముల చంద్రశేఖర్ క్షేత్రస్థాయిలో కీలకంగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు.
నేటికి 75 మంది నుంచి సేకరణ
2024 ఆగస్టు 1 నుంచి దీనికి ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. ప్రారంభంలో అంతగా స్పందన కనిపించలేదు. అంటే ఇందులో మృతి చెందిన వారి వివరాలు సేకరించడమే కీలకం. ఆ విషయం తెలుసుకోవడం, ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు కలిసి నేతద్రానం గురించి వివరించి ఒప్పించడం కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది. కానీ తర్వాత వివిధ మార్గాల ద్వారా మృతుల వివరాల సేకరణపై ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకోసం వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్లో శ్రద్ధాజలి పోస్టింగ్స్, పట్టణ కూడళ్లల్లో వెలిసే మృతుల ఫ్లెక్సీ ఫొటోలపై ఆధారపడ్డారు. దీంతో వివరాల సేకరణ కొంత సులువైంది. ఇదే సమయంలో కార్నియా సేకరించిన అనంతరం దాతల ఫొటోలతో పాటు, సేకరణ దృశ్యాలను సైతం సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రచారం కల్పించే ప్రయత్నం చేశారు. దీంతో గత ఆరు నెలల్లో నేత్రదానికి మెల్లమెల్లగా స్పందన పెరుగుతూ వచ్చింది. ఇలా ఫిబ్రవరి 15వ తేదీ నాటికి మొత్తం 75 మంది నుంచి 150 కార్నియాలను సేకరించారు. తొలి మూడ నెలలు పెద్దగా లేకపోయినా నవంబర్ నుంచి నేత్రదానం చేసే వారి సంఖ్య పెరిగింది. ఆగస్టులో 4, సెప్టెంబర్‌లో 4, అక్టోబర్‌లో 3 రాగా నవంబర్‌లో 10, డిసెంబర్లో 16, జనవరిలో 20 మంది నేత్రదానానికి ముందుకు వచ్చారు. ఇక ప్రస్తుత ఫిబ్రవరిలో రోజుకు ఒకరి నుంచి గత15 రోజుల్లోనే 18 మంది నుంచి కార్నియాలు సేకరించారు. రానున్న కాలంలో మరింత ఎక్కువ మంది నుంచి సేకరించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు కౌన్సిలర్ చిరునోముల చంద్రశేఖర్ వెల్లడించారు. తమ కుటుంబంలో ఎవరు చనిపోయినా సకాలంలో తమకు వివరాలు అందిస్తే వెళ్లి తామే కార్నియాలు సేకరిస్తామని ఆయన వివరించారు.
నేత్రదానం ఇలా..
సమాచారం ఇస్తే చాలు
మృతుల సమాచారం తెలుసుకోవడమే ఇందులో కీలకం. ఎవరైనా సరే సమాచారం ఇస్తే గంటలోపే అక్కడికి చేరుకోగలం. మృతుల కుటుంబ సభ్యుల అంగీకారంతో కార్నియా సేకరణ చేస్తాం. సమాచారం తెలుసుకోవడమే తమకు పరీక్షగా మారుతున్నది. ఇందుకోసం ఇప్పటికే పట్టణంలోని ఆస్పత్రులను సంప్రదిస్తున్నాం. వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఫోస్టింగ్స్ గమనిస్తున్నాం. ఫ్లెక్సీ షాపులను అలర్ట్ చేశాం. వివిధ సంస్థల ప్రతినిధులను అడుగుతున్నాం. ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం సమాచారం కొంత మెరుగైంది. ఇంకా ప్రజల సహకారం కూడా చాలా అవసరం. ఎవరైనా సరే తమ కుటుంబంలో గానీ, బంధువుల్లో గానీ, కాలనీలో గానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయిన వ్యక్తుల సమాచారం ఇవ్వాలని విజ్ఙప్తి. దీంతో చనిపోయిన వ్యక్తి మరో ఇద్దరి వ్యక్తులకు చూపును ప్రసాదించి చిరంజీవులుగా నిలుస్తారు.
– చిరునోముల చంద్రశేఖర్, ట్రస్ట్ కౌన్సిలర్
కనుగుడ్డుపై పొరనే సేకరిస్తాం
నేత్రదానం చేయడం చాలా సులువు. చనిపోయిన వ్యక్తుల నుంచి మాత్రమే సేకరణ జరుగుతుంది. అది కూడా కేవలం కనుగుడ్డుపైన ఉన్న పల్చటి పొరను మాత్రమే సేకరిస్తాం. అందువల్ల ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. కానీ నేత్రదానం(కార్నియా సేకరణ) వల్ల చూపు లేని అంధులకు ప్రపంచాన్ని చూపించవచ్చు. దీనివల్ల చనిపోయిన వ్యక్తి కండ్లకు జీవం పోసిన వాళ్లం అవుతాం. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మృతుల కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దేశంలో ఎంతో మంది కండ్లల్లో వెలుగులు నింపవచ్చు. ఇందులో వివిధ సంస్థల, ప్రముఖుల, ప్రజల భాగస్వామ్యం పెరుగాల్సి ఉంది.
– డాక్టర్ హరినాథ్, ఎండీ, చారిటబుల్ ట్రస్ట్