యాదగిరిగుట్ట, జూలై 6 : అమాయక నిరుపేదలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ రమేశ్, ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వారిపై వెంటనే కేసులు నమోదు చేసి శిక్షించాలన్నారు. యాదగిరిగుట్టలో బాధితులను శనివారం పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించాలన్నారు. లేకపోతే ఆయన ప్రమేయంతోనే పోలీసులు రెచ్చిపోతున్నారని భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనుచరులు తెలంగాణ తల్లి విగ్రహం ప్రాంతంలో శాశ్వత షెడ్లు నిర్మిస్తున్నారని, అడ్డుకుంటే ఇంతటి దాష్టికానికి పోలీసులు దిగుతారా? అని మండిపడ్డారు.
తెలంగాణ తల్లిని అవమానిస్తే ఊరుకోబోమన్నారు. థర్డ్ డిగ్రీని ప్రదర్శించలేదని సీఐ చెప్తున్నారని, కొట్టలేదని స్వామివారి పాదాల వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై వదిలిపెట్టే ప్రసక్తే లేదని, త్వరలో డీజీపీ రవిగుప్తా, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అరాచకాలు మొదలయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డిపై కేసులు పెట్టి హింసించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డాగా మారాయని, దందాలకు పాల్పడుతూ అమాయక ప్రజల రక్తం తాగుతున్నారని ఆరోపించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ కనుమరుగై దాడుల పోలీసింగ్ వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చామన్న అహంకారం మరిచి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు హితవు పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్‌గౌడ్, నాయకులు నరహరి, యాదగిరి, వెంకటయ్యగౌడ్ పాల్గొన్నారు.