భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 25: పైసాపైసా కూడబెట్టిన సొమ్ముతో చిన్న కాంట్రాక్టులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే సమయంలో చేసిన పనులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి చెందిన కాంట్రాక్టర్ భార్యా కుమారులతో కలిసి కలెక్టర్ కార్యాల యం ఎదుట టెంట్ వేసుకుని ధర్నా చేపట్టిన సంఘటన యాద్రాది భువనగిరి కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..మండలంలోని హన్మాపురం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు నాగపురి కృష్ణ కొన్నేండ్లుగా కాంట్రాక్టులు చేస్తున్నాడు. ఈక్రమంలో హన్మాపురంలో గ్రామ పంచాయతీ భవనం, తాజ్‌పూర్‌లో కురుమ భవనం, అనంతారంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కుర్మగూడెంలో బిసీ భవనాలను నిర్మాణం చేశాడు. చేపట్టిన పనులకు సంబంధించి రావాల్సిన రూ, 42లక్షలు పెండింగ్ బిల్లులు 2023 నుంచి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై అనారోగ్యం పాలయ్యాడు.
అభివృద్ధి పనుల కోసం అం దిన కాడల్లా చేసిన అప్పులు తడిసి మోపెడు కావడంతో అసహనానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాడు. విషయం తెలుసుకున్న పలు పార్టీలకు చెందిన నాయకులు నాగపురి కృష్ణ చేస్తున్న న్యాయమైన ధర్నాకు మద్దతు తెలిపి సంఘీభావాన్ని ప్రకటించారు.
ధర్నాకు పలు పార్టీల మద్దతు
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరూతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ నాగపురి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టిని ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేశవపట్నం రమేశ్, అబ్బగాని వెంకట్ గౌడ్, సింగిరెడ్డి నర్సిరెడ్డి, అంకర్ల మురళీకృష్ణ, సీపీఎం నాయకులు దయ్యాల నర్సిం హ, పల్లెర్ల అంజయ్య, దయ్యాల మల్లేశం సంఘీభావం తెలిపి మాట్లాడారు. అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్లు చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. కాంట్రాక్టర్ నాగపురి కృష్ణకు అం డగా ఉంటామన్నారు.