చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్ 28 : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆగిన ట్రావెల్స్ బస్సు ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకృష్ణా ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం అర్ధరాత్రి విజయవాడ నుంచి ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరింది. శనివారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం శివారుకు రాగానే బస్సు ఇంజిన్ హీట్ అవడంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపాడు.
హైదరాబాద్ వైపు కంటెయినర్ లారీ ఒకటి వెనుక నుంచి బస్సును ఢీకొట్టడంతో అందులో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఖమ్మం జిల్లా కారపల్లి మండలం మాడపల్లి గ్రామానికి చెందిన యజ్జు రవీందర్(24), హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఖమ్మం జిల్లా వెంసూరు మండలం వెనచేడువెంకటాపురం గ్రామానికి చెందిన పాల సతీశ్‌కుమార్(46)గా పోలీసులు గుర్తించారు.
చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేసి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించారు. క్షతగాత్రులకు చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి ప్రాధమిక చికిత్స అందించి హైదరాబాద్‌లోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ తెలిపారు.