బొడ్రాయిబజార్, మార్చి 12 : దిన దినాభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనాభా అంతకంతకు పెరుగుతుంది. దీంతో నివాస గృహాల్లో ఉత్పత్తి అయ్యే చెత్త కూడా గణనీయంగా ఉత్పత్తి అవుతుంది. ఈ చెత్తను సరిగా సేకరించి ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేసేందుకు సూర్యాపేట మున్సిపల్ అధికారులు, సిబ్బంది మూడు బుట్టల విధానాన్ని తీసుకొచ్చారు. ప్రజలు తమ ఇండ్లలోని చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరుచేసి ఇంటి ముందుకు వచ్చే మున్సిపల్ ట్రాక్టర్కు అందజేస్తున్నారు. అయితే కొందరు గృహస్తులు మాత్రం పలు కారణాలతో ట్రాక్టర్కు అందించకుండా తమ ప్రాంతంలోనే గతంలో కొనసాగిన ప్రదేశంలో చెత్తను వేస్తున్నారు. ఇది గమనించిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది చెత్త వేస్తున్న వారిని గుర్తించి అవగాహన కల్పించడంతో పాటు గార్బేజ్ ఫ్రీ సిటీలో భాగంగా చెత్త వేసే ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విధంగా జిల్లా కేంద్రంలో సుమారు 27 చెత్త వేసే ప్రదేశాలను గుర్తించి చెత్తను తొలగించి మొక్కలు నాటి చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ చెత్త ప్రదేశాలను సీసీ కెమెరాల నిఘాలో ఉంచి ఎవరైనా చెత్త వేస్తే వారికి జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరికల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ చర్యలు సత్ఫలితాలిచ్చి ఆయా ప్రాంతాలు ఆహ్లాదాన్ని పంచే మొక్కలతో మినీ పార్కులను తలపిస్తున్నాయి. అధికారుల చర్యలపై ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో దుర్గంధంతో ఇబ్బందులు పడ్డాం
చెత్త ప్రదేశాలను గుర్తించి చెత్తను తొలగించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉంది. మున్సిపల్ ట్రాక్టర్ వచ్చే సమయానికి ఇంటి వద్ద లేని వారు, ఉదయాన్నే బయటకు వెళ్లే గృహస్తులు చెత్తను ఇష్టానుసారంగా పడేస్తూ చెత్త ప్రదేశాలను సృష్టిస్తున్నారు. ఈ చర్య వల్ల ఆయా ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డాం. మున్సిపల్ అధికారులు చెత్త ప్రదేశాలను తొలగించి మొక్కలు నాటడం ఆనందంగా ఉంది.
– కడవెండి సతీశ్, సూర్యాపేట
మున్సిపల్ ట్రాక్టర్కే చెత్త అందజేయాలి
పరిశుభ్రమైన పట్టణంగా సూర్యాపేట పట్టణం జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. దాన్ని కొనసాగించాలంటే ప్రజలంతా చెత్తను మూడు విధాలుగా వేరు చేసి ఇంటి ముందుకు వచ్చిన మున్సిపల్ ట్రాక్టర్కు అందించాలి. కొందరు రోడ్లపై, మురికి కాల్వల్లో పోస్తున్నారని అలా చేయొద్దన్నారు. అపరిశుభ్ర ప్రదేశాలు లేకుండా చేసేందుకే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆయా ప్రదేశాల్లో మొక్కలు నాటి పెంచుతున్నాం.
– పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ చైర్పర్సన్, సూర్యాపేట