అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటూ అర చేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చాక హామీలకు ఎగనామం పెట్టింది. మహిళలకు ఇచ్చిన దాదాపు అన్ని హామీలను తుంగలో తొకింది. కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, మహాలక్ష్మి కింద నెలకు రూ.2,500, కాలేజీ విద్యార్థినులకు సూటీలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛను పెంపు వంటి హామీలేవీ అమలు చేయకుండా మొండి చెయ్యి చూపిస్తున్నది.
– యాదాద్రి భువనగిరి, మార్చి 7 (నమస్తే తెలంగాణ)
ఎన్నికల ఇచ్చిన హామీల ప్రకారం అధికారంలోకి వచ్చాక ఆయా పథకాల కోసం అన్ని వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. 2023 డిసెంబర్ 28న ప్రజా పాలన పేరుతో మొదలుపెట్టి జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో దరఖాస్తులు స్వీకరించారు. మహిళలకు సంబంధించిన పథకాల కోసం మొత్తంగా 12.06లక్షల అప్లికేషన్లు వచ్చాయి. కానీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా ఏదీ అమలు చేయలేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసింది. ఆడపిల్లల పెండ్లి సమయంలో పేద తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచేందుకు ఠంఛనుగా ఖాతాల్లో రూ. 1,00,116 జమ చేసింది. అయితే తమకు అధికారం ఇస్తే అందుకు అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ గొప్పలకు పోయింది. పెండ్లికి ముందే లగ్నపత్రిక చూపించి దరఖాస్తు చేసుకుంటే కల్యాణలక్ష్మి నగదు సాయంతోపాటు ఇందిరమ్మ కానుక కింద తులం బంగారం ఇస్తామని ప్రగల్బాలు పలికింది. కానీ తులం బంగారం ఊసే లేదు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 3వేల వరకు పెండిండ్లు జరిగాయి. మరోవైపు కల్యాణ లక్ష్మి చెకులు కూడా పెండింగ్‌లో మూలుగుతున్నాయి.
కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ.2,500 ముఖ్యమైంది. గత ఎన్నికల్లో ఈ హామీ ఎంతో ప్రభావితం చేసింది. ప్రస్తుతం అనేక సమస్యల మధ్య మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కొనసాగుతుండగా.. రూ.2,500 పథకం అమలు చేయలేదు. 18 ఏండ్లు దాటిన మహిళల అకౌంట్లో నెలనెలా జమ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రారంభించలేదు. మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదు. దీని కోసం జిల్లాలో 2.32 లక్షల మంది ఆడబిడ్డలు దరఖాస్తు చేసుకున్నారు. పథకం అమలు కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు.
కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు సూటీ ఇస్తామన్న కాంగ్రెస్ వాగ్దానం గాల్లో కలిసింది. 18 ఏండ్లు, అంతకంటే పైబడిన వయస్సు వారికి ఎలక్ట్రిక్ సూటీ ఇస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కార్యాచరణ రూపొందిస్తున్నామంటూ హడావుడి చేశారు. తీరా ఎన్నికల ముగిశాక అటకెకించారు. సమయం గడిచిపోతుండడంతో కాలేజీ విద్య పూర్తి చేసుకుంటున్న విద్యార్థినులు సూటీ కోల్పోయే అవకాశం ఉందని వాపోతున్నారు.
దేశంలోనే ఎకడా లేనివిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఈ పథకం కింద ఆర్థిక సాయంతోపాటు కిట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇది కూడా బంద్ అయ్యింది. గర్భిణులకు పౌష్టికాహారం అందించడం కోసం న్యూట్రిషన్ కిట్ అమలు చేయగా.. అదీ పత్తాలేకుండా పోయింది. 1,962 రూపాయల విలువైన కిట్‌తో గర్భిణుల్లో రక్త హీనతను నివారించి, మాతా శిశు మరణాలను తగ్గించాలని సంకల్పించి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. ఒంటరి మహిళలు, బీడీలు చుట్టి జీవనం సాగిస్తున్న మహిళా కార్మికులు, వితంతువులకు పింఛన్ పెంచుతామని చెప్పి పెంచనేలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పింఛన్ మొత్తాన్నే ఖాతాల్లో జమ చేస్తున్నారు. అవీ సమయానికి అందడం లేదు. మహిళల పేరిట ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినా ఎకడి గొంగడి అకడే అన్నట్లు తయారైంది.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు మహిళలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చాక చెప్పిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన కేసీఆర్ కిట్‌ను బంద్ పెట్టారు. కొత్త పింఛన్ల మాటే ఎత్తడం లేదు. మహిళల భద్రతకు కూడా భరోసా కరువైంది. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి సరిపడా బస్సులు తిప్పకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.
-సుర్వి సులోచన, గృహిణి, అంకిరెడ్డిగూడెం, చౌటుప్పల్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఊసేలేదు. కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి అసలు దాని గురించే మాట్లాడటం లేదు. కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. రూ.500 గ్యాస్ సబ్సిడీ కూడా అందరికీ రావడం లేదు. అమలు కాని హామీలిచ్చి ప్రభుత్వం మహిళలను మోసం చేసింది.
– బీసు ధనలక్ష్మి, ఆత్మకూరు(ఎం)