చండూరు, ఏప్రిల్ 12 : ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్రెడ్డి అన్నారు. “గావ్ చలో – బస్తీ చలో అభియాన్ ” కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా చండూర్ మండలం బోడంగిపర్తి గ్రామంలో ప్రజలతో మమేకమయ్యి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని, రేషన్ దుకాణాన్ని పార్టీ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో 10 రోజుల నుండి పిల్లలకు కోడిగుడ్లు సరఫరా చేయడం లేదని సంబంధిత అధికారులకు ఫోన్ లో ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేలా ఒత్తిడి చేసేందుకే బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే అర్హులు, లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు కట్కూరి రామలింగయ్య, సరికొండ సైదులు, మండల నాయకులు బరిగెల లింగస్వామి, సరికొండ పెద్ద సైదులు, గ్రామ నాయకులు వరికుప్పల మహేశ్, సాగర్ల యాదయ్య పాల్గొన్నారు.