ఆలేరు టౌన్, మార్చి 7: ఎన్నికల సమయంలో ఆలేరు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశ్ డిమాండ్ చేశారు. వడ్డేమాన్ బాలరాజు అధ్యక్షతన ఆలేరు పట్టణంలోని సీపీఎం పట్టణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రజా సమస్యల సాధన కోసంఈ నెల 4 న ప్రారంభమైన సీపీఎం పోరుబాటను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పోరు బాట సందర్భంగా ఆలేరు పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలను కలిసి ఇంటింటి సర్వే ద్వారా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని కల్లూరి మల్లేశ్ కోరారు. ఆలేరు పట్టణ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు,రేషన్ కార్డులు,బీడీ కార్మికుల పెన్షన్లు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్లు ఇవ్వకపోవడం వలన ప్రజలు చాలా అవస్థలు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రం పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని అన్నారు. మౌలిక వసతుల కల్పనలో పాలకవర్గాలు పూర్తిగా వైఫల్యం చెందాయని చెప్పారు.
గత సాధారణ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రధానంగా గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం, ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, ఆలేరు పట్టణ ప్రజలకు కలగానే మిగిలిపోయిందని కల్లూరి మల్లేశ్ ఆరోపించారు. రానున్న రోజుల్లో పోరు బాటలో భాగంగా పట్టణంలోని ప్రతి సమస్యను గుర్తించి వాటి సాధన కోసం జరిగే ప్రజా పోరాటాలలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్, పట్టణ నాయకులు మోరిగాడి రమేశ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ మోరిగాడి చంద్రశేఖర్, ఘనగాని మల్లేశం, రాజేశ్, కాసుల నరేశ్, వడ్డేమాన్ విప్లవ్ మాదాని, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
congres will