భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 24 : జిల్లా మేజిస్ట్రేట్ అయినటు వంటి కలెక్టర్ చాంబర్‌ను కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయంలా మార్చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టర్ చాంబర్లోకి గుంపుగా దూసుకువచ్చారు. అనుమతి లేకుండా అంతమంది రావద్దని కార్యాలయం సిబ్బంది వారించినా వినకుండా ఆఫీసులో హంగామా చేశారు. కలెక్టర్ చాంబర్‌లోని కుర్చీలు, సోఫాల్లో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నారు. కలెక్టర్ కుర్చీ వెనుక ఉండే మూడు సింహాల చిహ్నం, జాతీయ జెండాను కింద పడవేశారు. కాంగ్రెస్ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం అనీల్‌కుమార్‌రెడ్డి కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం అందించేందుకు వచ్చారు. ఆ సమయంలో వారి వెంట వచ్చిన నాయకులు కలెక్టర్ చాంబర్లో నానా హంగామా చేశారు.
కలెక్టర్ ఇతర కార్యక్రమాలకు హాజరు అయ్యేందుకు చాంబర్ నుంచి బయటకు వెళ్లినా కాంగ్రెస్ నేతలు ఆ చాంబర్లోనే చాలాసేపు ఉండిపోయారు. వివిధ సమస్యల మీద కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చే సామాన్య ప్రజలకు నానా ఆంక్షలు చెప్పే అధికారులు కాంగ్రెస్ నేతల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది.