Jagadish Reddy | సూర్యాపేట, అక్టోబర్ 10(నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో బతుకమ్మ ఆడబిడ్డల పండుగని, అలాంటి పండుగపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత అక్కసు ఎందుకని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మ వేడుకల్లో గురువారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో సరదగా ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్ వద్ద సుమారు 40వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారని, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బంది పడ్డారని అన్నారు. సద్దుల బతుకమ్మ రోజు ప్రకృతి కరుణించి వర్షం కురిపించి వాతావరణాన్ని చల్లబర్చిందని, ఇక రెండు మూడు గంటలైనా ఆడవచ్చనుకున్న మహిళలకు బతుకమ్మ పాట లేని నిశ్శబ్దం నిరాశను కల్గించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పండుగ పూట రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటే, బతుకమ్మ ఏర్పాట్లపై ఇంత నిర్లక్ష్యం చూస్తే ఊరుకోనివ్వడం లేదని తెలిపారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణదని, బతుకమ్మతో మన సంస్కృతి ఖండాంతరాలకు వ్యాపించిందని చెప్పారు. 60 ఏండ్ల అణిచివేతకు కొట్లాడి విముక్తి చేసుకున్నాక, ప్రతి పండుగను పదేండ్లు ప్రశాంతంగా జరుపుకున్నామని చెప్పారు. బతుకమ్మను కేసీఆర్ అధికారికంగా ప్రకటించి అంగరంగ వైభవంగా నిర్వహిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులతో పండుగ సంబురాలను చప్పగా చేసిందని విమర్శించారు. అధికార కాంగ్రెస్‌కు మన పండుగలన్నా, పాటలన్నా పట్టింపు లేదని, ముఖ్యంగా బతుకమ్మ పాట అంటే వాళ్లకు భయమైతుందని అన్నారు.
అధికారికంగా నిర్వహించాల్సిన బతుకమ్మ పండుగకు నిధులు లేక పోవడంతోపాటు మైకులు కూడా మూగబోయే దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎవరు ఏమి మాట్లాడినా ఆనాడు సమైక్యాంధ్రులను ఎదిరించి నిలబెట్టుకున్న సాంస్కృతిక వారసత్వం మనదని, తప్పకుండా ఈనాటి పాలకులను కూడా ఎదిరించి ఈ వారసత్వాన్ని నిలబెట్టుకుందామని ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణవాసులకు జగదీశ్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.