పేదలకు అందించే రేషన్ బియ్యం పంపిణీలో మళ్లీ జాప్యం జరుగుతున్నది. ప్రతి నెలా 20 నుంచి 5వ తేదీ వరకు గోదాముల నుంచి ప్రతి రేషన్ దుకాణానికి బియ్యం పంపిణీ జరుగాల్సి ఉండగా, ఇప్పటికీ జిల్లాలో 15 శాతం షాపులకు కూడా బియ్యం చేరలేదు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 610 రేషన్ షాపులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 88 షాపులకే బియ్యం చేరింది.
– సూర్యాపేట, మే 2 (నమస్తే తెలంగాణ)
ఆరంభ శూరత్వం అన్నట్లు మొదట్లో హడావుడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆపై అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అవుతున్నది. రుణమాఫీ, రైతుబంధు, ఇందిరమ్మ ఇళ్లు ఏ పథకం తీసుకున్నా అదే పరిస్థితి. పేదలకు సన్నబియ్యం అంటూ ప్రారంభించిన నెల రోజుల్లోనే పంపిణీలో ఆలస్యం నెలకొంటున్నది. ప్రతి నెలా గోదాముల నుంచి రేషన్ షాపులకు 20వ తేదీ నుంచి పదిహేను రోజుల్లో విడుతల వారీగా బియ్యం సరఫరా అవుతాయి. ఈ నెల రెండో తేదీ పూర్తవగా, ఇప్పుడిప్పుడే సరఫరా ప్రారంభమవుతున్నది. ఒకటి నుంచి 15 వరకు రేషన్ షాపుల నుంచి కార్డు హోల్డర్లకు డీలర్లు పంపిణీ చేయాల్సి ఉండగా గోదాముల నుంచి బియ్యం రాక డీలర్లు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
బియ్యం వస్తున్న లబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని డీలర్లు వాపోతున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 171 రేషన్ షాపులు ఉండగా ఇప్పటికు 23 షాపులకే బియ్యం చేరింది. కోదాడలో 146 షాపులకు గానూ 21, తుంగతుర్తిలో 105 షాపులకు 5, హుజూర్‌నగర్‌లో 188 షాపులకు 39 షాపులకే బియ్యం అయ్యింది. ప్రతి నెల 15 నుంచి 19 మధ్య ప్రభుత్వం నుంచి డైనమిక్ కీ రిజిస్టర్ రానుండగా ఈసారి ఏప్రిల్ 30న రావడం వల్ల సరఫరా ఆలస్యమైనట్లు పౌరసరఫరాల అధికారులు చెప్తున్నారు.
మూడు, నాలుగు నెలలకు సరిపడా మాత్రమే గోదాముల్లో సన్నబియ్యం ఉన్నట్లు తెలుస్తుండగా, ఖజానా ఖాళీగా ఉందంటున్న ప్రభుత్వం ఆ తర్వాత సన్న బియ్యం ఎలా సమీకరిస్తుంది, ఎలా పంపిణీ చేస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. బియ్యం పంపిణీలో జాప్యంపై జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్‌ను నమస్తే తెలంగాణ వివరణ కోరగా.. ‘కొన్నిసార్లు ఆలస్యమవడం సాధారణ విషయమే. పంపిణీ లేట్ ప్రారంభమైనా ప్రతి రేషన్ కార్డుదారుకూ బియ్యం అందిస్తాం’ అని చెప్పుకొచ్చారు.