కట్టంగూర్, జూలై 20 : కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇస్మాయిల్ పల్లి మాజీ ఉప సర్పంచ్ జాల అంజనేయులు, మరికొంతమంది రైతులతో కలిసి సోమవారం నల్లగొండలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 2026 యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు ఇన్చార్జిగా ఉన్న కారింగు సైదులు రైతుల ధాన్యాన్ని తన పేరిట నమోదు చేసి ప్రభుత్వ చెల్లింపులను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తెలిపారు. అసలు రైతులకు బదులుగా నకిలీ రైతుల పేర్లతో దొంగ ట్రక్ షీట్లు సృష్టించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. కొనుగోలు కేంద్రంలోని రికార్డులు, ట్రక్ షీట్లు, సీరియల్ రిజిస్టర్, చెల్లింపుల వివరాలను పరిశీలించాలని కలెక్టర్‌ను కోరారు. పూర్తి విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన సైదులుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో జానకిరాంరెడ్డి, కృష్ణ, నర్సింహ్మ, శంకర్ రెడ్డి ఉన్నారు.