సూర్యాపేట టౌన్, మార్చి 5 : ఎస్సారెస్పీ కాల్వలకు నీళ్లు ఇచ్చి ప్రభుత్వం ఎండుతున్న పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. ఇప్పటికే దెబ్బతిన్న వరి పంటకు సంబంధించి రైతులకు ఎకరాకు రూ.30వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. మద్దతు ధర, కొనుగోళ్లతోపాటు వివిధ సమస్యలపై సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్లు మల్లు నాగార్జునరెడ్డి, మండారి డేవిడ్‌కుమార్, షేక్ నజీర్, నల్లడ మాధవరెడ్డి, నారబోయిన వెంకట్‌యాదవ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని, అర్హులైన రైతులందరికీ పాత రుణాలను రద్దు చేసి కొత్తవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సన్నధాన్యం పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.500 నేటికీ పూర్తి స్థాయిలో అందలేదన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందించి నూతనకల్, మద్దిరాల, ఆత్మకూర్.ఎస్, చివ్వెంల, మోతె, పెన్‌పహాడ్, మునగాల, నడిగూడెం మండలాల్లో ఎండుతున్న పంటలను కాపాడాలని కోరారు. సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏఓ సుదర్శన్‌రెడ్డికి అందించారు. కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు వరికుప్పల వెంకన్న, బొడ్డు శంకర్, దండ వెంకట్‌రెడ్డి, మట్టిపల్లి సైదులు, ముల్కలపల్లి రాములు, పోటు లక్ష్మయ్య, పల్లె వెంకట్‌రెడ్డి, కరీం, కందాల శంకర్, మేకల కనకారావు, మెదరమెట్ల వెంకటేశ్వర్రావు, షేక్ సైదా, కొప్పుల రజిత, బెల్లంకొండ సత్యనారాయణ, నాగిరెడ్డి శేఖర్‌రెడ్డి, మందడి రాంరెడ్డి, వి.నర్సింహారావు, శ్రీకాంత్, సైదులు, ఉదయగిరి, కిరణ్, సాయికుమార్, మైబెల్లి ఉన్నారు.