నల్లగొండ, అక్టోబర్ 26: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కమీషన్ల దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. ప్రధానంగా ఈ సారి ఐకేపీ కేంద్రాలను అధికార పార్టీ నేతలే నడుపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో గతంలో నడిచే ఐకేపీ కేంద్రాలను నిర్వీర్యం చేస్తూ హాకా, మ్యాక్స్ పేరుతో కొత్త కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు వసూళ్ల విషయంలో మాత్రం తెగబడ్తున్నారు. సీరియల్స్‌తో సంబంధం లేకుండా ఒక్కో రైతు నుంచి రూ.వెయ్యి నుంచి రూ.2వేలు వసూలు చేస్తుండగా…మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ధాన్యం ఉన్న రైతుల దగ్గర అంతకు మించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రానికి అధికార పార్టీ నేతలకు సంబంధించిన ధాన్యం వస్తే తేమతో సంబంధం లేకుండా..అంటే 25 శాతం పైన ఉన్నా కాంటా వేస్తూ, అభ్యంతరం చెప్పిన మిల్లర్లకు సైతం వార్నింగ్ ఇస్తున్నారట. ఈ దందాకు తోడు ప్రతి రైతు వద్ద, కాంటా పూర్తయ్యాక కనీసం 10 కేజీల నుంచి 30 కేజీల వరకు చివరి వడ్లు ఉంచాలని చెప్పి తీసుకుంటున్నారట. ఈ కేంద్రాల్లో తమ మనిషిని పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారనే అరోపణలు వస్తున్నాయి.
మహిళా సంఘాలు నిర్వీర్యం..
ప్రతి ఏటా జిల్లాలో ప్యాక్స్, ఎన్డీసీఎమ్ఎస్, ఎఫ్‌పీవోలతో కనీసం 150 ఐకేపీ కేంద్రాలు ధాన్యం సేకరిస్తుంది. అయితే ఈ సారి కూడా ఆరంభంలో ఐకేపీల్లో 151 సెంటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ప్రారంభమతున్న సమయంలో రంగంలోకి దిగిన అధికార పార్టీ నేతలు ఐకేపీల్లో మెజార్టీ వాటిని తమ వశం చేసుకోగా, తమ వశం కాని ప్రాంతాల్లో హాకా, మ్యాక్స్ పేరుతో కొత్త అవతారం ఎత్తిన విషయం తెలిసింది. ఆయా కేంద్రాలను అధికార పార్టీకి చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నేతలు స్వాధీనం చేసుకొని ఒకరిద్దరు అసిస్టెంట్లను పెట్టుకొని రైతుల ముక్కు పిండి డబ్బులు వసూలు చేయటం గమనార్హం. ఒక్కో రైతు వద్ద రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలు, ఎక్కువ ధాన్యం ఉంటే అంతకు మించి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ మద్దతు దారులు ఉంటే 25 శాతం తేమ ఉన్నా కాంటా వేస్తూ, దిగుమతి చేస్తుండటంతో మిల్లర్లు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
కొత్త సెంటర్లల్లో అడ్డే లేదు..
నల్లగొండ నియోజక వర్గంలో ధాన్యం కొనుగోలులో కొత్త చట్టం అమలవుతున్న విషయం తెలిసిందే. అధికార పార్టీ నేత లు హాకా, మ్యాక్స్ పేరుతో కొత్తగా నియోజక వర్గంలోని రా ములుబండ, పిట్టలగూడెం, నర్సప్పగూడెం, చర్లపల్లి బైపాస్, చెన్నుగూడెం, జీ చెన్నారం గ్రామాల్లో కొత్త సెంటర్లు ఇస్తే, మ్యాక్స్ పేరుతో రెడ్డీ కాలనీ, చందనపల్లి, పజ్జూర్, ఖాజీ రామారం, వెంకటాద్రి పాలెం గ్రామాల్లో ఐకేపీలకు రాం రాం చెప్పి కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే ఈ సెంటర్లల్లో వ సూళ్ల దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోం. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 22500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, సన్న ధాన్యం మాత్రం ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదు. అయితే ఇప్పటి వరకు 178 లారీలు మాత్రమే కేటాయించటంతో లారీ డ్రైవర్లు కూడా లోడుకు రూ. వెయ్యికి తక్కువ కాకుండా వసూలు చేయటం గమనార్హం.