నార్కట్‌పల్లి, మే1 : కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు అధిక సంఖ్యలో లారీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.
సరిపడా లారీలు అందుబాటులో లేక ధాన్యం తరలింపు మందకొడిగా జరుగుతుందని కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కలెక్టర్ లారీ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తగినన్ని లారీలు ఏర్పాటు చేసి తక్షణమే ధాన్యాన్ని తరలించాలని ఆదేశించారు. ఒక వేళ కాంట్రాక్టర్ స్పందించకుంటే అతడిపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే చెల్లింపులు నిలిపివేయాలని సూచించారు.
ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. రైతులు సరైన తేమశాతంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట అధికారులు ఉన్నారు.