సూర్యాపేట అర్బన్, జనవరి 6 : ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ కళాశాలల స్థాయి స్పోర్ట్స్‌మీట్‌ను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకొని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. క్రీడలు మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
పట్టణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ మాట్లాడుతూ 1938లో స్థాపించిన ఎగ్జిబిషన్ సొసైటీ దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనను ప్రతి సంవత్సరం జనవరి 1నుంచి ఫిబ్రవరి 15 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నదన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయంతో 20 విద్యా సంస్థలను స్థాపించి 30వేల మంది విద్యార్థులకు విద్య అందిస్తున్నదని తెలిపారు.
ఈ 20 విద్యాసంస్థల విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నట్లు చెప్పారు. సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించినట్లు వివరించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ పి.హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ చంద్రజిత్‌సింగ్, మంజిత్‌రెడ్డి, ఎం.రాజశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, జయ ఆదిత్యరెడ్డి, శ్రీ వేంకటేశ్వర కళాశాల సెక్రటరీ ఎం.చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రాజు, డైరెక్టర్ డాక్టర్ కిరణ్‌కుమార్, కళాశాల పీడీలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.