సూర్యాపేట, జూన్ 14 : మాదకద్రవ్యాల నియంత్రణకు కఠినంగా వ్యవహరించాలని, వచ్చే 30 రోజుల్లో సూర్యాపేటను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల అలవాట్లను నడవడిని పరిశీలించాలని చెప్పారు. తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తన, అలవాట్లను గమనిస్తు ఉండాలని తెలిపారు.
అన్ని మండల కేంద్రాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. క్షేత్ర స్థాయిలో అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు బృందాలుగా ఏర్పడి వాటి వినియోగం వల్ల కలిగే నష్టాలను తల్లిదండ్రులకు తెలుపాలని చెప్పారు. మొదటి 15 రోజులు మండల స్థాయిలో, మిగతా 15 రోజులు మున్సిపాల్టీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ చెక్ పోస్టుల వద్ద వాహనాలను చెక్ చేయాలని, డ్రగ్స్, గంజాయి వంటి పదార్థాలు రవాణా కాకుండా తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అక్రమంగా పశువుల రవాణా నియంత్రణ కోసం చెక్ పోస్టుల వద్ద పశు సంవర్ధక శాఖ అధికారులను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ సతీశ్‌కుమార్, జడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, డీఎంహెచ్ఓ కోటాచలం, అధికారులు పాల్గొన్నారు.