భువనగిరి కలెక్టరేట్, జూన్ 6 : గ్రూప్-1 పరీక్షల నిర్వహణను పకాగా నిర్వహించాలని, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో చీప్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్వాడ్ అధికారులు, ఐడెండిఫికేషన్ ఆఫీసర్లు, బయోమెట్రిక్ ఆఫీసర్లకు పరీక్ష నిర్వహణపై గురువారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీజీపీఎస్సీ ద్వారా ఈ నెల 9న నిర్వహించే గ్రూప్ -1 పరీక్షకు ఏర్పాట్లు పకాగా చేపట్టాలన్నారు. అభ్యర్థులకు అసౌకర్యం కలుగకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు.
పరీక్ష నిర్వహణను చీఫ్ సూపరింటెండెంట్లు చేపట్టాలని, కేంద్రాల్లో సీటింగ్, వసతులను డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పరిశీలించాలని అన్నారు. ఆడ, మగ అభ్యర్థులకు వేర్వేరుగా తనిఖీ ఏర్పాట్లు చేయాలని, ఇతరులను అనుమతించవద్దని, ఫ్లయింగ్ స్వాడ్ యాక్షన్ ప్లాన్ కార్యాచరణతో పరీక్ష కేంద్రాలను పరిశీలించాలని సూచించారు. పరీక్ష రోజు ప్రతి సెంటర్‌ను మూడు సార్లు పరిశీలించాలన్నారు. ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు అభ్యర్థుల ఐడీ కార్డులతోపాటు హాల్ టికెట్లను పరిశీలించాలని, పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని, ఒక చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రమే ఎమర్జెన్సీ కోసం అనుమతి ఉన్నదని తెలిపారు. పరీక్షకు జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు.
సుమారు 3,349 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమాచారం, హాల్‌టికెట్ డౌన్లోడ్ గురించి జిల్లా స్థాయి హెల్ప్‌లైన్ 8331997006, 8331997037 నంబర్లలో సంప్రదించవచ్చని చెప్పారు. హాల్‌టికెట్‌ను http://www.tspsc.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏ4 పేపర్లో ప్రింట్ తీసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌పై అభ్యర్థి లేటెస్ట్ ఒరిజినల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలన్నారు. పరీక్ష హాల్‌కు హాల్‌టికెట్‌తోపాటు ఆధార్, పాస్‌పోర్ట్, పాన్, ఓటరు ఐడీ, ఇతర ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను తప్పనిసరిగా తీసుకెళ్లాలని తెలిపారు.
హాల్ టికెట్లో ఫొటో సరిగా ముద్రణ కాకపోయినా, కనిపించకున్నా గెజిటెడ్ అధికారి, అభ్యర్థి చివరగా చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌తో ధ్రువీకరించిన మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను, అండర్ టేకింగ్ ఫామ్ (టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఫార్మాట్)తో పాటు తీసుకురావాలన్నారు. ఆ ఫొటోలు, అండర్ టేకింగ్ ఫామ్‌ను పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్‌కు అందించాలని, లేకుంటే పరీక్ష హాల్లోకి అనుమతించబడరని తెలిపారు. అభ్యర్థి ఎవరైనా తన బయోమెట్రిక్‌ను ఇవ్వకపోతే వారి ఓఎంఆర్ ఆన్సర్ షీట్ మూల్యాంకనం చేయబడదని పేర్కొన్నారు. చేతులకు మెహంది, టాటూలతో పరీక్షకు వెళ్లకూడదని, ఒకవేళ ఉంటే బయోమెట్రిక్ చేయుటకు తంబ్ ఇంప్రెషన్ పడకపోవచ్చని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు షూస్, సాక్స్ ధరించరాదని, చెప్పులు మాత్రమే వేసుకోవాలని సూచించారు.
పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9నుంచి 10 గంటల వరకు అనుమతి ఉంటుందని, ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించబడరని చెప్పారు. అభ్యర్థికి ఒకవేళ చేతులు లేకపోతే సహాయకుల కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, చేతి గడియారాలు, హ్యాండ్ బ్యాగ్‌లు, బ్లూటూత్ డివైస్‌లు, పెన్‌డ్రైవ్‌లు, రైటింగ్ ప్యాడ్లు, తెల్ల కాగితాలు అనుమతించబడవని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద వస్తువులు భద్రపరచడానికి స్టోరేజీ సౌకర్యం కల్పించలేదని సూచించారు. పరీక్ష హాల్లో ప్రతి అర్ధ గంటకు హెచ్చరిక బెల్ మోగుతుందని, అభ్యర్థులు గమనించాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ కె.నారాయణరెడ్డి, టీజీపీఎస్సీ రీజనల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ బాలాజీ, ఏడీఏ నీలిమ, అధికారులు పాల్గొన్నారు.