నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : పానగల్ ఉదయసముద్రం రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైనట్లేనా? పూర్తయివతే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శనివారం ఎన్ని ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు? అన్నది జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఏ ప్రాజెక్టునైనా పనులన్నీ పూర్తయ్యాకే ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. కానీ బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు విషయంలో ప్రారంభోత్సవం అనే పదానికే రేవంత్ సర్కార్ కొత్త భాష్యం చెప్తున్నది. ప్రాజెక్టులోని అన్ని పంపులు పూర్తి స్థాయిలో రన్ కాలేదు. రిజర్వాయర్ పనులు ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రధాన కాల్వల తవ్వకం 50 శాతం కూడా పూర్తి కాలేదు. వీటి నుంచి కీలకమైన డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు భూ సేకరణే జరుగలేదు. అవి ఇప్పటిలో తవ్వే పరిస్థితే లేదు. ఇప్పట్లో ఒక్క ఎకరాకూ నీరు పారేది లేదు. ఆ నీటితో పంటలు పండేది లేదు. అయినా సరే ప్రాజెక్టు పూర్తయినట్లు మభ్య పెడుతూ ప్రారంభానికి ఏర్పాట్లు చేయడం విస్మయానికి గురిచేస్తున్నది. అందుకోసం ఏకంగా శంకుస్థాపన పైలాన్ పక్కనే ప్రారంభోత్సవానికి సైతం పైలాన్‌ను సిద్ధం చేయడం గమనార్హం. తన కలల ప్రాజెక్టు అని చెప్పుకొనే బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతలను అసంపూర్తిగా ప్రారంభింప చేయడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉన్న ‘ప్రత్యేక శ్రద్ధ’ ఎంటో అనేది చర్చనీయాంశంగా మారింది.
శాశ్వత నీటి కేటాయింపులు లేకుండా కేవలం పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్‌పై ఆధారపడి 2007లో బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకానికి అప్పటి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. లక్ష ఎకరాలకు సాగునీరు, 107 గ్రామాలకు తాగునీరు లక్ష్యంగా రూ.699 కోట్ల అంచనా వ్యయంతో 2007 సెప్టెంబర్ 4న శంకుస్థాపన జరిగింది. 2012 ఆగస్టులోనే పనులు పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ సర్కార్ కొంత కుదుటపడ్డాక దీనికి దశల వారీగా నిధులు కేటాయిస్తూ వచ్చింది.
2018 నుంచి పనులు వేగవంతం చేస్తూ పంపుహౌస్, రిజర్వాయర్ పనులు, పానగల్ ఉదయ సముద్రం నుంచి అప్రోచ్ కెనాల్ పటిష్టం, సొరంగ మార్గం పనుల లైనింగ్, విద్యుత్ పనులను పూర్తి చేసింది. అందుకు సుమారు రూ.130 కోట్లు వెచ్చించింది. గత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో ట్రయల్ రన్‌ను పూర్తి చేసింది. నీటిని ఎత్తి రిజర్వాయర్‌లో పోయడంతో ట్రయల్ రన్ సక్సెస్ అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇక భూసేకరణపై దృష్టి సారించి ప్రధాన కాల్వలతో పాటు డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తుండగా 2023 ఆగస్టు నుంచి ఎన్నికల వాతావరణ మొదలైంది.
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాజెక్టు పనుల్లో కదలిక మందగించింది. ఈ ఏడాది కాలంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనులేవీ లేవు. నిధులు కూడా కేటాయించిన దాఖలాల్లేవు. తిరిగి మరోసారి ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించి నీటిని ఎత్తిపోసారు. భూ సేకరణ కోసం నిధులు ఇవ్వలేదు. కాల్వల తవ్వకంపైనా దృష్టి పెట్టలేదు. ఇవేవీ పూర్తి కాకుండానే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు భ్రమింపజేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభోత్సవానికి వస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభోత్సవ పైలాన్‌ను కూడా ఆవిష్కరణకు సిద్ధం చేశారు.
బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు కేసీఆర్ సర్కార్ హాయంలోనే ట్రయల్న్ నిర్వహించాం. మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్‌లో నీటిని ఎత్తిపోసాం. ఈ లోపే ఎన్నికలు రావడంతో మిగతా పనులు మేము కొనసాగించలేకపోయాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా చేపట్టిన పనులు లేవు. నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంకా కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల భూసేకరణ జరపాల్సి ఉంది. కానీ తిరిగి ఈ మధ్య మరోసారి మోటార్లను ఆన్‌చేసి ట్రయల్న్ చేసి తామే చేసినట్లుగా నటిస్తున్నారు. వాస్తవంగా భూసేకరణ చేసి కాల్వలు తవ్వితేనే పొలాలకు సాగునీరు పారుతుంది. ఇది జరగాలంటే మరో రూ.500 కోట్లు కేటాయించాలి. కేవలం ట్రయల్ రన్‌తోనే ప్రాజెక్టును పూర్తిచేసినట్లుగా ప్రారంభించాలనుకోవడం ప్రజలను మోసం చేయడమే. తక్షణమే నేడు అసంపూర్తి ప్రాజెక్టును ప్రారంభించేందుకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అవసరమైన నిధులను మంజూరీ చేసి తమ చిత్తశుద్దిని చాటుకోవాలి. లేకుంటే ప్రజలు తగిన సమయంలో బుద్దిచెప్పడం ఖాయం.
ప్రాజెక్టులో కీలకమైన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థనే పెండింగ్‌లో ఉంది. దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తయితేనే కాల్వలు తవ్వి, సాగునీటిని అందించే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై నేటికి కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించిన దాఖలాలు లేవు. ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీల కోసం 3.851 ఎకరాలను సేకరించాల్సి ఉండగా, 1.456 ఎకరాలను సేకరించారు. కుడి కాల్వకు సంబంధించి 25.5 కిలోమీటర్లకు గానూ 11 కిలోమీటర్లు పూర్తయ్యింది. ఎడమ కాల్వ కోసం 6.5 కిలోమీటర్ల భూ సేకరణకు గానూ 4.5 కిలోమీటర్లు పూర్తయ్యింది. ఇక భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లోనూ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. ఎడమ కాల్వ ద్వారా 43 వేల ఎకరాలకు, కుడికాల్వ ద్వారా 57వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రాజెక్టు ఉద్దేశ్యం.
ఇప్పటివరకు కాల్వలకు నీటిని విడుదల చేసే వ్యవస్థనే సిద్ధ్దం కాలేదు. కేవలం రిజర్వాయర్‌లో నీటిని ఎత్తిపోసి కొంతమేర నిల్వ చేయడం వరకే పనులు పూర్తయ్యాయి. ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే పూర్తికావడం విశేషం. దాంతోపాటు అక్కంపల్లి నుంచి పానగల్ వరకు వచ్చే ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ సామర్ధ్యం 1,200 క్యూసెక్కులకు మించడం లేదు. ప్రస్తుతం ఉన్న ప్రధాన కాల్వ సామర్ధ్యంతో బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అనేది అసాధ్యంగానే కనిపిస్తుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న కాల్వ సామర్ధ్యాన్ని కనీసం 3వేల క్యూసెక్కుల సామర్ధ్యానికి విస్తరిస్తూ లైనింగ్ పనులు చేపట్టాలన్న డిమాండ్ పెరుగుతుంది. రానున్న రోజుల్లో ఎల్ఎల్బీసీ సొరంగ మార్గం కూడా అందుబాటులోకి వస్తే ఆ నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి విస్తరణ, లైనింగ్ పనులు తోడ్పడతాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి సూచిస్తున్నారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి తన పర్యటనతో దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 2.25గంటలకు బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టకు చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్టు ప్రారంభిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించి పూజలు నిర్వహిస్తారు. అటునుంచి 2.55 గంటలకు బయల్దేరి దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు చేరుకుంటారు. 3.20 నుంచి 3.40 గంటల వరకు యాదాద్రి పవర్ ప్లాంట్‌లోని రెండో యూనిట్ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి సాయంత్రం 4.10 గంటలకు బయల్దేరి 4.25 గంటలకు నల్లగొండలోని మెడికల్ కాలేజీకి చేరుకుంటారు. అక్కడి కాలేజీ ప్రారంభోత్సవం పాల్గొని అనంతరం 5గంటలకు అక్కడే రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.