దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ అద్భుతంగా పాలన సాగిస్తున్నారని.. వందేండ్లలో జరుగని అభివృద్ధిని పదేండ్లలోనే చేసి చూపించిన ఘనత ఆయనదేనని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, గత ఎమ్మెల్యే ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురం, మే 18 : ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే విజయమని, శతాబ్ద కాలంలో జరుగని తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంలోనే జరిగిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండలంలోని పుట్టపాకలో గురువారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, డెయిరీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధిలో వెనుకబడ్డ తెలంగాణ రాష్టాన్ని తొమ్మిది ఏండ్లలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలోని పేదలకు బీఆర్ఎస్ జెండా అండగా నిలిచిందన్నారు.
దేశంలోని ఏ రాష్ర్టానికి సాధ్యం కాని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రజల కలలను సాకారం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ సంస్థలను ఉపయోగిస్తూ నాయకులపై దాడులు చేయిస్తుందని ఆరోపించారు. ప్రజలు బీజేపీ కుట్రలను గమనించి వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డెయిరీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్‌కుమార్, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బోళ్ల శివశంకర్, పీఏసీఏస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యం
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీజేపీలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు పన్నుతుంది. వాటిని ప్రజలు తిప్పికొట్టాలి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పని చేసి గులాబీ పార్టీకి అఖండ విజయం కట్టబెట్టాలి.
– పల్లె రవికుమార్, కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్
వచ్చే ఎన్నికల్లోనూ గులాబీ జెండాదే విజయం
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుంది. 2014 నుంచి 2018 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. 2018లో ఓ కాంట్రాక్టర్ ఎమ్మెల్యేగా గెలువడంతో అభివృద్ధి కుంటుపడింది. తిరిగి ఆయన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో టిక్కెట్ కేటాయించి గెలిపించారు. నిమోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనులు చేపడుతున్నాం. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 72 కోట్లతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, మున్సిపాలిటీలకు రూ.80 కోట్లు, గిరిజన భవనానికి రూ.2 కోట్లు, చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రి, రూ.90 కోట్లతో ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణ పనులు, పంచాయతీరాజ్ నిధులు రూ.136 కోట్లు, రూ.42 కోట్లతో కాల్వలు, చెరువులపై చెక్‌డ్యామ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది.
– ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి