నల్లగొండ ప్రతినిధి, నవంబర్14(నమస్తే తెలంగాణ) : ‘జానారెడ్డి గురించి నేను విమర్శ చేయదలుచుకోలె. ఆయన ఆర్అండ్బీ మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు రోడ్లు తప్ప ఇక్కడ ఏమీ జరుగలే. రేపు కూడా జరిగేది ఉండదు. బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ యువకుడు. బలహీన వర్గాల బిడ్డ. మంచి ఉత్సాహవంతమైన యువకుడు, విద్యావంతుడు, వినయమున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని గెలిపిస్తే కులం, మతం లేకుండా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతది. నోముల భగత్‌ను గుండెల కత్తుకొని గెలిపించండి. మీ సాగర్ అభివృద్ధి బాధ్యత నాది. నేనే అన్ని పనులు చేయిస్తానని మనవి చేస్తున్న’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. హాలియాలో మంగళవారం జరిగిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆశేష జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నెల్లికల్లు లిఫ్ట్‌ను వచ్చే ఏడెనిమిది నెలల్లో పూర్తి చేసి, ప్రారంభించేందుకు తానే స్వయంగా వస్తానని కేసీఆర్ ప్రకటించారు. సాగర్ ఆయకట్టుకు నీరు ఇవ్వడంతోపాటు నీటి తీరువాను రద్దు చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌దేనని వివరించారు.
ఆనాడు రెండేండ్లలో 24గంటల కరెంటు ఇస్తే గులాబీ కండువా మెడలో వేసుకుంటానని జానారెడ్డి ప్రకటించి ఆ తర్వాత మాట తప్పాడని విమర్శించారు. మాట తప్పడమే కాదు.. ఉప ఎన్నికల్లో భగత్‌పై పోటీకి దిగితే ప్రజలే బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిందేమిటి? బీఆర్ఎస్ పాలనలో జరుగుతున్నదేమిటి? ఇక్కడి ప్రజలు ఆలోచించాలని కోరారు. సాగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను 70నుంచి 80వేల భారీ మెజార్టీతో గెలిపిస్తే నాగార్జునసాగర్ అభివృద్ధి బాధ్యత తనదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజా ఆశీర్వాద సభ ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో దండు కట్టి స్వచ్ఛందంగా కదిలివచ్చారు.
హాలియా పట్టణ సమీపంలోని అనుములలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అధ్యక్షతన ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు ప్రతి గ్రామం, తండా నుంచి జనం తరలివచ్చి తమ అభిమాన నేత, అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. దాంతో హాలియాకు వచ్చే దారులన్నీ సభకు వచ్చే వాహనాలతో కిక్కిరిసిపోయాయి. గులాబీ సైన్యం సభకు బారులు తీరింది. అధినేత కేసీఆర్ సభా వేదికపైకి వచ్చే సరికి సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. భారీ ఎత్తున తరలివచ్చిన ఆశేష జనావాహినిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ 25 నిమిషాలపాటు ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరణతోపాటు విపక్షాలపై పంచ్‌లు, సాగర్ అభివృద్ధి, జానారెడ్డి వైఫల్యాలపై కొనసాగడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రసంగం మధ్యలో అనేక సార్లు చప్పట్లు, ఈలలు, అరుపులు, కేరింతలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఓటు అనేది మీ తలరాతను మారుస్తది. వచ్చే ఐదేండ్లు ఎవరు పాలించాలి? ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే క్షేమంగా ఉంటది? పార్టీలు ఏంటి? ఏ పార్టీ చరిత్ర ఏమిటి? ఎవరి చేతికి అధికారం ఇస్తే ఏం చేశారు? ఇవన్నీ ఆలోచించాలి, గ్రామాల్లో చర్చ పెట్టాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మీ అందరికీ తెలుసు.. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రజల హక్కుల కోసం.. రాష్ట్రం సాధించడం కోసం.. కానీ, కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లుగా ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని పరిపాలించిన పార్టీ.. బీఆర్ఎస్ పదేండ్లు పాలించింది.. మరి ఎవరి కాలంలో ఏం జరిగింది అనేది మీరంతా గ్రహించాలి’ అని సూచించారు. కాంగెస్ పార్టీ ఎన్నడూ ధైర్యంతో పనిచేసి పేదలను ఆదుకోలేదలేదన్నారు. సాగర్‌లో ఎన్నోసార్లు గెలిపించిన జానారెడ్డి మంత్రిగా, ప్రతిపక్ష నేతగా పని చేసినా ఇక్కడ చేసిందేమిటో ఆలోచించాలన్నారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే సరికి సాగర్‌కు సరిగ్గా నీళ్లే రాకపోయేవని గుర్తు చేశారు.
నేనే వచ్చి నెల్లికల్ లిఫ్ట్‌ను ప్రారంభిస్తా..
నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘భగత్ ఎమ్మెల్యే అయ్యాకనే రెండు లిఫ్ట్‌లు కావాలంటే ఒకటి స్టార్ అయ్యింది. నెల్లికల్ లిఫ్ట్ మాత్రం తొలుత ఐదు వేల ఎకరాలకే ఉంటే దాని రీ డిజైన్ చేసి 25 వేల ఎకరాలకు పెంచి పనులు చేపట్టాం. రాబోయే ఏడెనిమిది నెలల్లో నెల్లికల్ లిఫ్ట్‌ను పూర్తి చేస్తాం. నేనే స్వయంగా వచ్చి ప్రారంభిస్తా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. సాగర్ ఆయకట్టులో కాంగ్రెస్ హయాంలో ముక్కుపిండి వసూలు చేసే నీటి తీరువాను బీఆర్ఎస్ సర్కారు వచ్చాకే రద్దు చేసి రైతుల కష్టాలు తీర్చినట్లు గుర్తు చేశారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు వద్దని, పీసీసీ అధ్యక్షుడు 3 గంటల కరెంటు చాలని, రాహుల్‌గాంధీ ధరణి తీసేస్తానని అంటున్నారని తెలిపారు. ఇవన్నీ ఉండాలా? వద్దా? అని ప్రజలను ప్రశ్నించగా అన్నీ యథావిధిగా ఉండాలని సభా ప్రాంగణం చప్పట్లతో సమ్మతి తెలిపింది.
కరెంటుపై మాట తప్పిన జానారెడ్డి..
రెండేండ్లలో రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తామని ఆనాడు అసెంబ్లీలో ప్రకటన చేశా. జానారెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆయన లేచి ఒక మాట చెప్పిండు. కేసీఆర్ గారూ మీరు రెండేండ్లలో కాదు, నాలుగేండ్లలో 24 గంటల కరెంటు ఇచ్చినా.. నేను కాంగ్రెస్ కండువా తీసేసి గులాబీ కండువా మెడలో వేసుకుని కార్యకర్తలా పని చేస్తానని చెప్పిండు. వాస్తవానికి 24 గంటలు ఇచ్చి నేను సక్సెస్ అయ్యా. జానారెడ్డి మాత్రం మాట మీద నిలువలేదన్నారు. పైగా ఆయన ఉప ఎన్నికల్లో భగత్ మీద నిలబడితే మీరే బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఆయన వైఖరి ఏమిటో అర్థం చేసుకుని భగత్‌ను గెలిపించి సాగర్‌ను మరింత అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్తోనే మరింత సంక్షేమం
బీఆర్ఎస్తోనే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమని కేసీఆర్ చెప్పారు. మీరు భగత్‌ను గెలిపిస్తే రైతుబంధు రూ.16వేలకు, పింఛన్ 5వేలకు, తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, మహిళలకు నెలకు 3 వేల భృతి, ప్రతి ఇంటికీ కేసీఆర్ భీమా.. ఇలా అనేక మంచి పనులు జరుగుతాయి అని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఏదీ రాయో, ఏదీ రత్నమో గుర్తించేలా ప్రజలకు వివరించాలి. ఇట్లా చర్చ చేస్తే నోముల భగత్ 70 నుంచి 80 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. భగత్‌ను గెలిపిస్తే ఆయన అడిగిన పనులన్నీ పూర్తిచేసే బాధ్యత నాది అని సీఎం హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్‌లో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పొరపాటున కాంగ్రెస్ వస్తే కరెంటు పోవుడు ఖాయం.. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీం.. ఎవ్వరూ ఎక్కడ పోతరో తెల్వదు. కాంగ్రెసోళ్ల చేతులకు రాజ్యం పోతే వైకుంఠ ఆట మాదిరిగా మల్ల పెద్దపాము మింగి కిందికి వచ్చినట్లయితది. అందుకే ఆలోచించి ఓటు వేయండి. బీఆర్ఎస్ను గెలిపించండి అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.