సూర్యాపేట టౌన్, నవంబర్ 27 : బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూర్యాపేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని పోలీస్ భరోసా సెంటర్లో బాలల హక్కులను కాపాడడం, బాల్య వివాహాలను అరికట్టడంపై పోలీస్ సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేసి ఆయన మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన 100 రోజుల ప్రణాళికని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు.
బాలలపై లైంగిక వేధింపులు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఆడపిల్లల పట్ల వివక్షతను విడనాడాలని తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్ సిబ్బంది ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ రవి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హరిబాబు, షీ టీమ్ పోలీస్ సిబ్బంది, భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.