ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్కారు తీపికబురు వినిపించింది. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. టీచర్ల సర్దుబాటుతో ఇప్పటికే ఖాళీలను సేకరించిన రాష్ట్ర విద్యాశాఖ రెండ్రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2017లో టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం మరోమారు నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడాది జూన్ నాటికి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా, ఆ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ విభాగాల్లో సుమారు 503 టీచర్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదల తర్వాత దీనిపై మరింత స్పష్టత రానున్నది.
రామగిరి ,ఆగస్టు 25 : ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చూపులు ఫలించాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసేందుకు విద్యా శాఖ సన్నద్ధం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ అభ్యర్థులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతోకాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకై ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెండు రోజుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికే జిల్లాల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్యను విద్యా శాఖ సేకరించింది. దాని ప్రకారం 2023 జూన్ నాటికి ఉన్న ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 503 పోస్టులు వివిధ కేటగిరీలలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది.
నల్లగొండ జిల్లాలో 6,451 ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 5,319 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కాగా 1,132 నల్లగొండ జిల్లాలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల కొన్ని పాఠశాలలు మూతపడగా ఉపాధ్యాయుల సర్దుబాటు అనంతరం నల్గొండ జిల్లాలో 219 పోస్టులు భర్తీయే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల సమాచారం. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న వారి సంఖ్య తెలియాల్సి ఉన్నది.